Ganza Smugglers: గంజాయి స్మగ్లర్లు సరుకు తరలించడానికి కొత్తకొత్త మార్గాలు వెతుకున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్... పోలీసుల కళ్లు కప్పి ఎర్రచందనం తరలించడానికి ఎన్ని ఎత్తులు వేశాడో చూశాం. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి తెలంగాణకు గంజాయి సరఫరాకు చేసేందుకు స్మగ్లర్లు కూడా అదే బాటలో వెళ్తున్నారు. మార్గమధ్యలో పోలీసులు కన్నుగప్పేందుకు.. ఖరీదైన కార్లు వాడుతూ వాటిపై పోలీసు, ప్రెస్ అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకు కూరగాయలు, అల్లం, పసుపు, పశువులు, ఎరువును రవాణా చేస్తున్నట్టు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ రాష్ట్రాల్లో డిమాండ్:మహారాష్ట్ర, కర్ణాటకల్లో మత్తుపదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముంబయి, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల గంజాయి రూ. 2,000 నుంచి రూ. 3,000 ఇచ్చి మరీ కొనుగోలు చేసేవారు ఉన్నారు. ఖాకీల తనిఖీలు తప్పించుకుని సరుకు గమ్యం చేర్చటం.. గంజాయి స్మగ్లర్లకు సవాల్‌గా మారింది. సరఫరా తగ్గిపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటకలో గంజాయికి డిమాండ్ పెరిగిపోయింది. కిలో గంజాయి రూ.30 వేల వరకూ పలుకుతోంది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు మహారాష్ట్ర వ్యాపారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో గంజాయి రవాణా చేసి అరెస్టైన పాతనేరస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వారి ద్వారా ఏవోబీ, విశాఖ, రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాల నుంచి సరుకు రవాణా చేసేందుకు పెద్దమొత్తంలో ఆఫర్ చేస్తున్నారు.
ఇలా సాగింది గంజాయి సరఫరా:తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన 10 మంది ఇటీవల రెండు కార్లలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు -ఏవోబీకి వెళ్లి 100 కిలోల సరుకుతో బయల్దేరారు. చౌటుప్పల్ వద్ద రాచకొండ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు తమకు ఆర్డరిచ్చారని.. సరుకు జహీరాబాద్ చేర్చితే చాలని చెప్పినట్లు పోలీసులకు తెలిపారు. ఒక్కో కారు డ్రైవర్‌కు కేవలం రెండ్రోజులకే రూ.40 వేలు కిరాయి ముట్టజెప్పారు.