ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్ కార్డులు - ఏపీఎస్​ఆర్టీసీలో స్మార్ట్ కార్డులు వార్తలు

టిక్కెట్ల కోసం పడే చిల్లర కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బస్సుల్లో ప్రయాణానికి స్మార్ట్ కార్డులను నేటి నుంచి ప్రవేశపెట్టనుంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ కార్డు.. స్వైప్ చేస్తే చాలు..టికెట్ జారీ కానుంది. మెట్రో రైళ్లలో ప్రయాణానికి వినియోగిస్తోన్న స్మార్ట్ కార్డులను...ఆర్టీసీలోనూ ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు.

smart cards introduce in apsrtc buses from today
smart cards introduce in apsrtc buses from today

By

Published : Feb 19, 2020, 8:56 AM IST

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం ప్రయాణికులు సహా సిబ్బంది పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సిటీ బస్సులు, పల్లెవెలుగు బస్సుల్లోనూ కష్టాలు షరామామూలే. బస్సెక్కే ముందే చిల్లర చూసుకోవాల్సిన పరిస్ధితి. సరిపడా చిల్లర దొరక్క..పడుతున్న అవస్థలు తగ్గించేందుకు సిటీ బస్సుల్లో కనీసఛార్జీని ఐదు రూపాయలు చేసినా ఉపశమనం లభించలేదు. సమస్య పరిష్కారం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టాలని ఏపీఎస్​​ఆర్టీసీ నిర్ణయించింది.

'ఛలో'తో ముందడుగు

హైదరాబాద్, ముంబయి, దిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణానికి ఇస్తున్నట్లుగా స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఏటీఎం కార్డు తరహాలో స్వైప్ చేసి టికెట్ జారీ చేసే వ్యవస్థను ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఉచితంగా సాంకేతిక సహకారం అందించేందుకు 'ఛలో' అనే సంస్థ ఆసక్తి చూపటంతో ముందడుగు వేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న కొన్ని టిమ్‌ యంత్రాలను ఆధునీకరించి.. ఎలక్ట్రానిక్ టిమ్స్ ప్రవేశపెట్టారు. స్మార్ట్ కార్డులతో అనుసంధానం చేశారు. విజయవాడలోని గవర్నర్ పేట డిపోలో ప్రయోగాత్మకంగా అమలు చేసి పరిశీలించారు. ఇవాళ్టి నుంచి ఈ సేవలు..ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్ కార్డులు

మొదటి మూడు నెలలు ఉచితంగా

మొదట మూడు నెలలు ఉచితంగా వీటిని జారీ చేయనున్నారు. స్మార్ట్ కార్డు తీసుకున్న ప్రయాణికులు ముందుగా కొంత మొత్తాన్ని కార్డులో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. బస్ కండక్టర్ వద్ద లేక బస్టాండ్లలో రీఛార్జ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. బస్సెక్కిన ప్రయాణికులు.... స్మార్ట్ కార్డును కండక్టర్​కు ఇస్తే చాలు టిమ్ యంత్రం ముందు స్వైప్ చేసి గమ్యస్థానాన్ని బట్టి నిర్ణీత టికెట్ జారీ అవుతుంది. నగదు రహితంగా సేవలు పొందవచ్చు. స్మార్ట్ కార్డులో ఎంత నగదు ఖర్చు అయిందనే విషయంతోపాటు టికెట్ వివరాలతో ప్రయాణికుడి చరవాణీకి సందేశం వస్తుంది. చిల్లర సమస్యను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా దీన్ని రూపొందించారు. వీటి ద్వారా నకిలీ బస్‌ పాసుల బెడదనూ అరికట్టవచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

ఛలో పేరిట సరికొత్త మొబైల్ యాప్‌ను సైతం నేటి నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. సిటీ బస్సుల రాకపోకల సమయం సహా బస్సు ఎక్కడుందో కచ్చింతంగా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మనం ఎక్కాల్సిన బస్సు...ఎంత సేపట్లో మన వద్దకు వస్తుందో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సిటీ బస్సుల్లో ఫలితాలను బట్టి దశలవారీగా పల్లెవెలుగు ,ఎక్స్ ప్రెస్ బస్సులకూ స్మార్ట్ కార్డు, మొబైల్ టికెటింగ్ సేవలను విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి : చంద్రబాబు భద్రతలో మార్పుల్లేవు: డీజీపీ కార్యాలయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details