ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NEET: నీట్​లో తొలిసారిగా ప్రశ్నలను ఎంచుకునే విధానం

నీట్‌ వైద్య విద్య (NEET) 2021-22లో తొలిసారిగా ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో మొత్తం 180 ప్రశ్నలుండగా.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండేది. ఈ ఏడాది మరో 20 ప్రశ్నలను చేర్చారు. మొత్తం 200 ప్రశ్నలు ఉన్నా.. రాయాల్సింది మాత్రం 180 ప్రశ్నలే.

slight changes in neet exam
నీట్​లో తొలిసారిగా ప్రశ్నలను ఎంచుకునే విధానం

By

Published : Jul 14, 2021, 11:58 AM IST

నీట్‌(NEET) వైద్యవిద్యలో ఈ ఏడాది మరో 20 ప్రశ్నలను అదనంగా చేర్చారు. గతంలో 180 ప్రశ్నలు ఉండగా.. ప్రస్తుతం 200 ప్రశ్నలు ఉండబోతున్నాయి. కానీ రాయాల్సింది మాత్రం 180 ప్రశ్నలే. ఈ మేరకు నీట్‌లో తాజాగా స్వల్ప మార్పులు(Slight changes in neet)చేశారు. అవేంటో చూసేయండి.

ఒక్కో సబ్జెక్టుకు ఐదు ప్రశ్నలు అదనం

  • గతేడాది వరకూ నీట్‌లో వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఒక్కో సబ్జెక్టులో 45 ప్రశ్నలుండేవి. అంటే మొత్తంగా 180 ప్రశ్నలు.
  • సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పైతే 1 మార్కు కోత. మొత్తం మార్కులు 720.
  • అన్నీ కూడా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే. మొత్తం పరీక్ష సమయం 180 నిమిషాలు. ఇప్పుడూ ఇదే విధానం.
  • ఈసారి ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నలు అదనంగా కలిపారు. అంటే ఒక్కో సబ్జెక్టుకు 50 ప్రశ్నలు. దీంతో మొత్తం ప్రశ్నలు 200.
  • ప్రతి సబ్జెక్టును ‘ఎ’.. ‘బి’.. సెక్షన్లుగా విభజించారు.
  • ‘ఎ’ సెక్షన్‌లో 35 ప్రశ్నలుంటాయి. అన్నింటినీ రాయాలి. ‘బి’ సెక్షన్‌లో 15కి 10రాస్తే చాలు.
  • మొత్తంగా 180 ప్రశ్నలకే సమాధానాలు రాయాలి.
  • గతంతో పోల్చినప్పుడు విద్యార్థులకు 20 ప్రశ్నల మేరకు వెసులుబాటు కల్పించినట్లుగా అనిపించినా.. ఇందులోనూ సరిగ్గా అంచనా వేయకపోతే విద్యార్థులు నష్టపోయే అవకాశాలెక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ...

నీట్‌(NEET)ను ఈ ఏడాది సెప్టెంబరు 12న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహిస్తామని ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NATIONAL TESTING AGENCY) ప్రకటించింది. పరీక్ష నిర్వహణ విధానం తదితర అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 6న అర్ధరాత్రి 11.50 గంటల వరకూ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. నీట్‌ ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తామనేది త్వరలో తెలియజేస్తామని ఎన్‌టీఏ(NTA) తెలిపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హయత్‌నగర్‌లలో నీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలలో పెడుతున్నట్టు తెలిపింది. గతేడాది కంటే ఈ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఎన్ని కేంద్రాలనే స్పష్టత మాత్రం ఈ సమాచారంలో ఇవ్వలేదు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నీట్‌ను రాయొచ్చు.

విద్యార్థులకు మరింత సవాల్‌

ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఈ తరహాలోనే ప్రశ్నలను ఎంచుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు అదే విధానాన్ని నీట్‌లోనూ ప్రవేశపెట్టారు. ఒక్కో సబ్జెక్టులో 5 ప్రశ్నలను అదనంగా ఎంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల.. విద్యార్థులు మొత్తం 200 ప్రశ్నలను చదవాల్సి ఉంటుంది. సమయం మాత్రం 180 నిమిషాలే. ఆ అదనపు ప్రశ్నలను చదివితే తప్ప.. ఏ ప్రశ్నను ఎంచుకోవాలనే విషయంలో విద్యార్థికి స్పష్టత రాదు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను చదివి ఎంచుకోవడమనేది విద్యార్థులకు సవాలే. ఇది ఒక విధంగా నష్టాన్ని కూడా కలగజేస్తుంది. అందుకే ఈ కోణంలో విద్యార్థులు మరింతగా అభ్యసించాలి. - డి.శంకర్‌రావు, డీన్‌, శ్రీచైతన్య విద్యా సంస్థలు, కూకట్‌పల్లి బ్రాంచ్‌

ఇదీ చూడండి:

Need Help: శివయ్యను కాపాడుకోవాలని తల్లి ఆవదేన.. సాయానికి ఎవరైనా ముందుకొచ్చేనా..?

ABOUT THE AUTHOR

...view details