హైదరాబాదీలు పడుకునే ముందు వరకూ 94 శాతం మంది మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నట్లు వేక్‌ఫిట్.కో తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. గతేడాది ఈ సంఖ్య 91 శాతంగా ఉంది. ఈ అధ్యయనం ప్రకారం.. సుమారు 80 శాతం మంది వారానికి ఒకటి నుంచి మూడు రోజులు నిద్రమబ్బుతోనే పని చేస్తున్నట్లు తేలింది. 26 శాతం మంది అర్ధరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌లలో సినిమాలు చూశామని చెప్పారు. 16 శాతం మంది స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌లతో బెడ్‌పైనే ఉండి పని చేసినట్లు వెల్లడించారు. 40 శాతం మంది వెన్నునొప్పితో బాధ పడుతున్నారని, 90 శాతం మంది కంటే ఎక్కువ మంది రాత్రి సమయాల్లో ఒకటి లేదా రెండు సార్లు మేల్కొంటారని అధ్యయనంలో తేలింది. అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై అవగాహన ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది.
నాణ్యతపై తీవ్ర ప్రభావం..
2020 నుంచి నిద్ర సంబంధిత నాణ్యత క్షీణిస్తున్నట్లు జీఐఎస్‌ఎస్ అధ్యయనం సూచిస్తోంది. నాణ్యమైన నిద్రకు మూడు అంశాలు తోడ్పడతాయని నగరవాసులు భావిస్తున్నట్లు ఈ అధ్యయనం వివరించింది. మెరుగైన పరుపులతో సుఖ నిద్రకు అవకాశం ఉందని 38 శాతం మంది, నిద్రించే ముందు లాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ వాడకపోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని 32 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. క్రమబద్ధమైన నిద్ర అలవాట్లను మెరుగుపరుచుకోవడం సత్ఫలితాలనిస్తుందని మరో 28 శాతం మంది భావిస్తున్నారు.