Disha accused encounter case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్. సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ అభిప్రాయపడింది. నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంటూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ వి.ఎస్. సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది.
పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి.జానకిరాం, ఆర్.బాలూ రాఠోడ్, డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని కమిషన్ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని నివేదికలో పేర్కొంది.
రెండేళ్ల పైనే దర్యాప్తు:2019 నవంబర్ 27న యువవైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులను విచారణ సమయంలో పారిపోయేందుకు యత్నించడంతోపాటు పోలీసుల వద్ద తుపాకులు లాక్కొని కాల్పులు జరపగా నలుగురు నిందితులు మరణించారు. ఆ ఘటనపై మానవహక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు.. 2019 డిసెంబర్ 12న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించింది. ఆరునెలల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన కమిషన్.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు మృతుల కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్లు నమోదుచేసింది. ఎన్‌కౌంటర్ సమయంలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా కమిషన్ విచారించింది. కరోనా కారణంగా దర్యాప్తు ఆలస్యం కావడంతో ఈ ఏడాది జనవరి 28న కమిషన్ తన నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకి అందజేసింది. ఈసందర్భంగా కేసు విచారణను వాయిదా వేస్తూ నివేదికను పరిశీలించాకే విచారణ జరపనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టుకు బదిలీ:మొత్తం 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్.. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్‌కౌంటర్ మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పరిశీలించి.. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది. కమిషన్ ఇచ్చిన నివేదిక, మానవహక్కుల సంఘాలు, ప్రభుత్వ వాదనలు అన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు... ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ కేసును ప్రత్యేకంగా తాము మానిటర్ చేయలేమని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో...హైకోర్టు నిర్ణయిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: