Sircilla Dyeing industry closed : తెలంగాణలోని సిరిసిల్లలో వస్త్ర ప్రపంచానికి రంగులద్దే కీలకమైన అద్దకం పరిశ్రమ సోమవారం మూతబడింది. ఈ రంగంలో నష్టాలు కొనసాగుతుండటంతో పరిశ్రమల యజమానులు మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో 300 వరకు అద్దకం పరిశ్రమలు ఉండేవి. కాలానుగుణంగా అవి 60కి పడిపోయాయి. మూడు నెలల నుంచి రంగుల ధరలు పెరిగిపోయి పూర్తిగా నష్టం వాటిల్లుతుండడంతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కూడా సోమవారం నుంచి మూసివేశారు. దీంతో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాగే సుమారు 15 వేల మంది మరమగ్గాల, పెట్టికోట్స్ కుట్టే, సైజింగ్ కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది.
fabric dye price hike 2021 : అద్దకం పరిశ్రమకు సంబంధించిన రంగుల ధరలు రూ.500 నుంచి రూ. 800లకు పెరిగాయి. రూ.2 వేలు ఉన్న రంగు ధర రూ.4,500లకు చేరుకుంది. రూ.200 ఉన్న రంగు ధర రూ.350కి చేరుకుంది. దీంతో రంగులద్దిన వస్త్రానికి మీటరుకు రూ.6.25 ఖర్చవుతుండగా వస్త్ర వ్యాపారులు రూ.4.25 చెల్లిస్తున్నారు. దీంతో తమపై మీటరుకు రూ.2ల భారం పడుతోందని అద్దకం పరిశ్రమ యజమానులు పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి బయటకు రావడానికి వస్త్ర వ్యాపారులను ధరలు పెంచాలని కోరినప్పటికీ తామూ నష్టాల్లో ఉన్నామని, నూలు ధర విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం ధర పెంచే పరిస్థితిలో లేమని వారు తేల్చి చెప్పారు. దీంతో గత్యంతరం లేక అద్దకం పరిశ్రమలను పూర్తిగా మూసివేశారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.