ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దేశం మనదే...తేజం మనదే...' గేయ రచయిత కుటుంబ కన్నీటి గాథ ఇది! - telangana 2021 news

దేశం మనదే...తేజం మనదే... ఎగురుతున్నా జెండా మనదే అంటూ సాగే పాట విన్న ప్రతి పౌరుడు గొంతు కలుపుతాడు. గుండెల నిండా దేశభక్తిని నింపుకొని ఆలపిస్తాడు. అంతలా దేశభక్తిని రగిల్చేలా తన గాత్రంతో పాటకు ప్రాణం పోశాడు ప్రముఖ నేపథ్య గాయకుడు జై శ్రీనివాస్. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నేరేడుకొమ్మ శ్రీనివాస్ ఇటీవల కరోనా బారినపడి తన పాటకు వీడ్కోలు పలికాడు. జై శ్రీనివాసే లోకంగా బతిన ఆయన భార్యా పిల్లలు ప్రస్తుతం ధీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. తండ్రి దూరమై పిల్లలు, భర్త లేక భార్య... కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేశం మనదనుకున్న సమాజం నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

singer-srinivas
singer-srinivas

By

Published : Aug 15, 2021, 8:57 AM IST

'దేశం మనదే...తేజం మనదే...' గేయ రచయిత కుటుంబ కన్నీటి గాథ ఇది!

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో దేశభక్తిని రగల్చడంలో పాటలు ప్రముఖ పాత్ర పోషించాయి. కవులు, రచయితలు తమ కలాలను ఎక్కుపెట్టి ప్రజల్లో దేశభక్తిని పెపొందించారు. గాయకులు గొంతెత్తి పాడి నింగీ నేలను ఏకం చేసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. అలాంటి కోవలోకే వస్తాడు జై శ్రీనివాస్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తేజ దర్శకత్వంలో వచ్చిన జై చిత్రంలో దేశం మనదే తేజం మనదే పాట పాడి కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. తెలంగాణ ఉద్యమంలోనూ అనేక గీతాలు పాడి ప్రజలను చైతన్యపరిచారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు శ్రీనివాస్ గళం వినిపించింది. ఆంగ్లచిత్రం ది ఇండియన్ పోస్ట్ మ్యాన్‌లో బతుకమ్మ పాటపాడిన తొలి తెలుగు గాయకుడిగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.

గానగంధర్వుడిని కబళించిన కరోనా..

కీరవాణి, అనూప్ రూబెన్స్ సంగీత బృందంలో ఎన్నో చిత్రాలకు పనిచేశాడు. ఇటీవల కరోనా వైరస్‌ ఆ గానగంధర్వుడిని కబళించింది. ఒక్క పాటతో ప్రతీ తెలుగోడి అభిమానాన్ని చూరగొన్న జై శ్రీనివాస్ మరణం అతని కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా చేసింది. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్య స్వాతి గృహిణి కాగా పెద్దమ్మాయి అభిజ్ఞ ఎనిమిదో తరగతి చదువుతుంది. చిన్నమ్మాయి జైత్ర ఐదో తరగతి చదువుతుంది. జై శ్రీనివాస్‌ను కాపాడుకునేందుకు భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు ఎంతో శ్రమించారు. అప్పులు చేసి 27 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. పాటలు పాడేందుకు కోలుకుని తిరిగొస్తానని చెప్పిన తండ్రి కానరాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చుతామని బాధాతప్తహృదయంలో పిల్లలిద్దరు చెబుతున్నారు.

ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితి

జై శ్రీనివాస్ సంపాదన అంతా ఆపదలో ఉన్న వారి సహాయానికే ఖర్చు పెట్టేవారని వాపోతున్న అతని భార్య స్వాతి కుటుంబ భవిష్యత్‌కు ఏ ఆస్తులు సంపాదించలేదని విలపిస్తోంది. పిల్లల చదువులతోపాటు ఇంటి అద్దె కట్టలేని ధీనస్థితిలో ఉన్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది.

అండ కోసం ఆకాంక్ష..

పాటనే ఉద్యోగంగా భావించి కుటుంబాన్ని పోషించుకున్న జైశ్రీనివాస్ అకాల మరణం సంగీత ప్రియుల మదిని కలిచివేసింది. దేశం మనదే పాటను గౌరవిస్తూ ప్రభుత్వం జైశ్రీనివాస్‌ కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details