కరోనా పరిస్థితిని అధిగమించి ఈ ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.8,180 కోట్ల టర్నోవర్ సాధించి రికార్డు నెలకొల్పామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. గతేడాది ఇదే కాలానికి సింగరేణి సాధించిన రూ.4,748 కోట్ల రూపాయల టర్నోవర్‌పై ఇది 72 శాతం అధికం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో 800 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు శ్రీధర్ తెలిపారు.
Singareni Turnover: సింగరేణి రికార్డు.. మొదటి నాలుగు నెలల్లోనే రూ.800 కోట్ల లాభాలు - గోదావరిఖని సింగరేణి
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అద్భుత వృద్దిని సాధించింది. కరోనా పరిస్థితులను అధిగమించి రూ.8,180 కోట్ల టర్నోవర్ సాధించి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పొలిస్తే 72 శాతం అధికమని సింగరేణి సీఎండీ శ్రీధర్ వివరించారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల వరకు బొగ్గు సరఫరాకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.
గతేడాది ఇదే కాలానికి 303 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసిన కంపెనీ ఈ ఏడాది సాధించిన అద్భుతమైన టర్నోవర్ రీత్యా.. 364 శాతం వృద్ధితో లాభాలను పొందిందని సీఎండీ వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.6,949 కోట్ల టర్నోవర్ సాధించి.. గతేడాది ఇదే కాలానికి సాధించిన రూ.3,816 కోట్ల బొగ్గు అమ్మకాల టర్నోవర్‌పై 82 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ తొలి నాలుగు నెలల్లో రూ.1,231కోట్ల విద్యుత్ అమ్మకాలు జరిపి గతేడాది కంటే 32శాతం వృద్దిని సాధించిందని సీఎండీ పేర్కొన్నారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల వరకు బొగ్గు సరఫరాకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నామని సీఎండీ శ్రీధర్ వివరించారు.