ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇలాగైతే బాధితులకు కష్టాలే

గతంలో ఎదురైన అనుభవాల నుంచైనా... కరోనా నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టటం లేదు. కొవిడ్ కేర్ కేంద్రాల్లో మందులు కొరత వేధిస్తుండటంతో.. బాధితులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొవిడ్ కేంద్రాల్లో అజిత్రోమైసిన్ మాత్రలు సైతం అందించలేకపోతున్నారంటే.. కొరత పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

shortage of medicine
కొవిడ్ కేంద్రాల్లో మందులు కొరత

By

Published : Apr 22, 2021, 3:42 PM IST

కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఉండేవారికి మందుల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. వైరస్‌ సోకినా లక్షణాలు తక్కువగా ఉండి, ఆరోగ్యం బాగా ఉన్నవారిని ఈ కేంద్రాల్లో ఉంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతానికి 36 వరకు ఈ కేంద్రాలను ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. గుంటూరు జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో ఉన్న వైరస్‌ బాధితులకు తొలి రెండు, మూడు రోజులు సక్రమంగా మందుల పంపిణీ జరగలేదు. కనీసం దగ్గుమందు.. అజిత్రోమైసిన్‌ మాత్ర కూడా ఇవ్వలేదు. బయట మార్కెట్లో కొన్న మాత్రలే కుటుంబసభ్యుల ద్వారా బాధితులకు అందాయి. నిబంధనల ప్రకారం బాధితులు ఇళ్లలో ఉన్నప్పుడు ఏ మాత్రలు వాడారో వాటినే వైద్య ఆరోగ్యశాఖ అందించాలి. ఇళ్లవద్ద నుంచి మందులు తెచ్చుకుంటే అనుమతిస్తారు. బాధితుల విజ్ఞప్తులతో ఒక్కో మందును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి.

గతానుభవాలపై దృష్టిపెట్టాలి:కరోనా వైరస్‌ కేసులు పెరిగేకొద్దీ.. ఈ కేంద్రాలకు తాకిడి పెరుగుతుంది. వైరస్‌ సోకి, ఇంటి వద్ద సౌకర్యంగా లేనివారు ఈ కేంద్రాల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కిందటేడాది బాధితుల సంఖ్యకు తగ్గట్లు నాణ్యమైన భోజనం అందించడంలో తీవ్ర సమస్యలొచ్చాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.

అడ్మిషన్‌ దొరక్క అవస్థలు:ర్యాపిడ్‌ యాంటీజెన్‌, సీటీస్కాన్‌ ద్వారా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయినవారు నేరుగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే.. వీరిని ఇక్కడ చేర్చుకోవడం లేదు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చి, జిల్లా అధికారులు చెబితేనే చేర్చుకుంటామని అక్కడివారు అంటున్నారు. ఈ విషయమై గూడవల్లి కేంద్రం వద్ద బాధితులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరిగాయి. అనధికారిక పరీక్షలకు గుర్తింపు లేదని, ప్రభుత్వ పరీక్షలు, వాటి ఫలితాల ఆధారంగానే చికిత్స, పడకల కేటాయింపు ఉంటుందని కృష్ణా జిల్లా అధికారులు వెల్లడించారు. కానీ ఆ పరీక్షలకు ఎక్కువ సమయం పట్టడంతో.. అంతవరకు ఎలా వేచి ఉంటామని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

ట్రయేజ్‌ కేంద్రాలు ఏవీ?: వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కాగానే బాధితులకు జిల్లాల్లో గుర్తించిన ట్రయేజ్‌ కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు చేయాలి. కిందటేడాది ఈ కేంద్రాల్లో ఈసీజీ, ఎక్స్‌రే, ఇతర పరికరాల ద్వారా బాధితులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ ఫలితాలను బట్టి బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించాలా? కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఉంచాలా? అన్న దానిపై నిర్ణయాలు తీసుకొన్నారు. విజయవాడలోని దంతవైద్య ఆసుపత్రిలో దీన్ని ఇటీవల ఏర్పాటుచేసినా... ఇంకా వినియోగంలోకి రాలేదు. వీటిపై ప్రభుత్వంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి:శ్రమ‘ఫలం’పై... చేదు వైరస్‌!

ABOUT THE AUTHOR

...view details