ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్కడ సూది మందు చూస్తే వైద్యులు, రోగులకు హడలే...! - guntur latest news

వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటేనే భయం.. ఆపై ఇంజెక్షన్‌ చేయించుకోవాలంటే మరింత ఆందోళన.. సూది మందుకు కూడా ఎక్కడైనా భయపడతారా అనుకునేరు.. తెనాలి జిల్లా ఆస్పత్రిలో మాత్రం సూది చూస్తేనే చాలు ముచ్చెమటలు పట్టాల్సిందే.. ఇక గుంటూరు జీజీహెచ్‌లో రోగుల దగ్గరకు వెళ్లి పరీక్షించేందుకు వైద్యులు భయపడిపోతున్నారు.. కనీసం వారికి చేతికి గ్లౌవ్స్‌ కరవయ్యాయి..ఎందుకూ ఏమిటీ పరిస్థితి అని కారణాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Shortage of gloves in Guntur and Chilakaluripet hospitals
అక్కడి ఆసుపత్రుల్లో సూది చూస్తే చెమటలు పట్టాల్సిందే

By

Published : Oct 18, 2020, 8:29 AM IST

Updated : Oct 18, 2020, 11:49 AM IST

కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ రోగులకు తెనాలి జిల్లా ఆస్పత్రి పెద్ద సంఖ్యలో వైద్యసేవలు అందిస్తోంది. ఇక్కడ రోగులకు 2 సీ, 5 సీ సిరంజీలు లేవని ఏకంగా 10 సీ సిరంజీలతో ఇంజెక్షన్లు చేస్తున్నారు. ఆ పెద్ద సిరంజీలు చూసి రోగులు బెంబేలెత్తుతున్నారు. ఇంజెక్షన్‌ చేస్తుంటే నొప్పి ఎక్కువగా ఉంటోందని కన్నీరు పెట్టుకుంటున్నారు. మల్టీవిటమిన్‌ ట్యాబ్లెట్లకు బదులు బీకాంప్లెక్సు మందులు సరఫరా చేస్తున్నారు. కనీసం ఆస్పత్రిలో డెలివరీ కిట్లకు కొరతొచ్చింది.

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌) నుంచి సరఫరా లేక ఇలా వ్యవహరిస్తున్నారా అంటే కానే కాదు. ఆస్పత్రికి అవసరమైన మందులు, సర్జికల్‌ సామగ్రిని ముందుగా ఇండెంట్‌ పెట్టుకుని వాటిని సమకూర్చుకునే విషయంలో యంత్రాంగానికి సరైన ప్రణాళిక లోపించింది. ఒకవేళ సీడీఎస్‌ నుంచే జాప్యం జరిగితే లోకల్‌ పర్ఛేజెస్‌ కింద వాటిని సమకూర్చుకుని రోగులకు వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ఉన్నతాధికార యంత్రాంగంపై ఉంది. చాలా వరకు తాము అడిగిన సిరంజీలు సీడీఎస్‌ నుంచి సరఫరా కాలేదని, అందువల్లే ప్రత్యామ్నాయంగా 10 సీసీ సిరంజీలతో ఇంజెక్షన్లు చేస్తున్నామని సిబ్బంది పేర్కొంటున్నారు.

గుంటూరులోనూ...

గుంటూరు జీజీహెచ్‌లోనూ కొన్ని సమస్యలు రోగులకు శాపమవుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వైద్యులు వెళ్లి చూడడానికి వారికి సర్జికల్‌ గ్లౌవ్స్‌, ఎక్స్‌టర్నల్‌ గ్లౌవ్స్‌, ఎగ్జామినేషన్‌ గ్లౌవ్స్‌, ఆప్రాన్స్‌, డెలివరీ కిట్లు వంటివి అందుబాటులో లేవు. దీంతో రోగులను చూడడానికి వైద్యులు వెళ్లలేని పరిస్థితి. చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే వారిని స్థానికంగా ఉన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపుతున్నారు. ఇక్కడా గ్లౌవ్స్‌ లేవు. కరోనా నేపథ్యంలో సర్జికల్‌ సామగ్రి ఉత్పత్తి బాగా తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రులు ముందుచూపుతో వ్యవహరిస్తే కొంతమేరకు రోగులకు ఇక్కట్లు తప్పుతాయి. రోజుల వ్యవధిలో పలానా సామగ్రి కావాలని ఇండెంట్‌ పెట్టి వాటిని సరఫరా చేయాలని కోరడం యంత్రాంగం తీరుగా మారింది. ఒకవైపు ఆస్పత్రులు, మరోవైపు సీడీఎస్‌ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తేనే రోగులకు ఇక్కట్లు తప్పుతాయి.

2సీ బదులు 10సీ వాడడం సరికాదు..

ఎక్కువ డోస్‌, ఎక్కువ సెలైన్లు అవసరమైనవారికి మాత్రమే 10సీ సిరంజీలు వాడాలి. రోగి బాగా బలహీనమై రక్తపోటు పడిపోతున్న పరిస్థితుల్లో మాత్రమే ఆ సామర్థ్యం సిరంజీలు వాడాల్సి వస్తుంది. రోగులకు వాటిని వాడడం అంటే వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. సాధారణ ఇంజెక్షన్లకు ఇంతపెద్దవి వాడి వాటి అవసరం ఏర్పడినప్పుడు అవి అందుబాటులో లేకపోయినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రోగులకు 2సీ సిరంజీ, రక్తం తీయడానికి 5సీ, అధిక డోసుల అవసరమైనవారికి 10సీ సిరంజీలు ఇంజెక్షన్లకు వినియోగించాలి. -ఆచార్య ఆర్‌.నాగేశ్వరరావు, సామాజిక వ్యాధుల విభాగాధిపతి, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల

ఇదీ చదవండి:

నీట్‌లో తీవ్ర పోటీ...మారుతున్న ర్యాంకులు !

Last Updated : Oct 18, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details