రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకుల సంఖ్య తగ్గుతోంది. 2015-16లో 1,08,112 మంది అధ్యాపకులు ఉండగా.. 2019-20కి ఈ సంఖ్య 99,737 దిగువకు చేరింది. బోధన సిబ్బంది సంఖ్య తగ్గుతున్నా.. కళాశాలలు, విశ్వవిద్యాలయాల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని అఖిలభారత ఉన్నతవిద్య సర్వే బహిర్గతం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ఈ నివేదికను విడుదల చేశారు. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, డిప్లొమా కళాశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీకాకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది.
2015-16లో కళాశాలలు 2,532, అన్ని రకాల వర్సిటీలు కలిపి 28 ఉండగా.. గత విద్యా సంవత్సరానికి కళాశాలల సంఖ్య 2,750కి, వర్సిటీల సంఖ్య 41కి చేరింది. ప్రతి లక్ష మంది విద్యార్థులకు జాతీయ స్థాయిలో సగటున 30 కళాశాలలు ఉండగా.. రాష్ట్రంలో 51 ఉన్నాయి. కర్ణాటక (59), తెలంగాణ (53) తర్వాత రాష్ట్రం మూడోస్థానంలో నిలిచింది. విద్యార్థుల ప్రవేశాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. జాతీయస్థాయిలో సగటున కళాశాలకు 680 చొప్పున ప్రవేశాలు ఉండగా.. రాష్ట్రంలో సగటున 547 మాత్రమే ఉన్నాయి.
ప్రైవేటుదే హవా..
ఉన్నతవిద్యలో ప్రైవేటు విద్యాసంస్థలదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో అత్యధిక ప్రైవేటు విద్యాసంస్థలున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. జాతీయ సరాసరిన 78.6% ప్రైవేటు సంస్థలుండగా.. రాష్ట్రంలో ఇది 81%. తెలంగాణలో 80, ఉత్తర్‌ప్రదేశ్ 78.5, తమిళనాడులో 77.6% ఉన్నాయి. విద్యార్థుల చేరికలూ ప్రైవేటులోనే ఎక్కువ. ప్రైవేటులో 10,46,189, ఎయిడెడ్‌లో 1,43,701, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,76,975 మంది ప్రవేశాలు పొందారు. అత్యధిక కళాశాలలున్న మొదటి పది జిల్లాల్లో గుంటూరు తొమ్మిదో స్థానంలో ఉంది. బెంగళూరులో అత్యధికంగా 1,009 విద్యాసంస్థలు ఉండగా.. గుంటూరులో 301 ఉన్నాయి. దేశంలో అత్యధిక కళాశాలలున్న జాబితాలో ఏపీ ఐదో స్థానంలో ఉంది.