అది ఓ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రి. దానికి మొత్తం 250 పడకలు ఐసీయూకు చెందినవే ఉన్నాయి. గత 10 రోజులుగా ఒక్క పడక ఖాళీ కాలేదు. ఈ ఆసుపత్రికి వెయిటింగ్ లిస్టు మరో 50 వరకు ఉంది. మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి.
విజయవాడ జీజీహెచ్‌కు వస్తున్న కొవిడ్ రోగులకు పడకలు లభించడం లేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగు ఆసుపత్రులు కిటకిట లాడుతున్నాయి. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా వైద్యులు అందుబాటులో లేక సతమతమవుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఆసుపత్రుల్లో చేరిన వారే కానీ ఆరోగ్యం మెరుగుపడి డిశ్ఛార్జి అయిన వారు కనిపించడం లేదు.. మరోవైపు ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల ముందు పడకల కోసం పడిగాపులు కాస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. జిల్లా ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి రోజుకు కనీసం 20 మంది రోగులు కొత్తగా పడకల కోసం వస్తున్నారు. వారిని తిప్పి పంపుతున్నారు. జిల్లా ఆసుపత్రికి వస్తే.. పిన్నమనేని అని.. అక్కడికి వెళితే.. ఇక్కడ ఖాళీ లేవు.. ఇబ్రహీంపట్నం నిమ్రాకు వెళ్లమని, అక్కడికి వెళితే.. ఆక్సిజన్ పడకలు లేవని చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించాలని సలహా ఇస్తున్నారు. ప్రైవేటు వారిని సంప్రదిస్తే... ఖాళీ లేవనే సమాధానం వస్తుంది. వైద్యం ఖర్చుకు లెక్క చేయకుండా ప్రాణాలు దక్కించుకుంటే చాలన్న భావన కుటుంబీకుల్లో ఉంటోంది. ఒకవైపు ఆసుపత్రుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసినా ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో వివిధ ఆసుపత్రులకు ఎక్కువ రుసుములు వసూలు చేసినందుకు రూ.15లక్షల వరకు జరిమానాలు విధించారు. అయినా ధరలు తగ్గుతున్న దాఖలాలు లేవు.
సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించింది. బుధవారం నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థ కూడా స్తంభించనుంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, టాక్సీలు నిలుపుదల చేయనున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే చర్యలు తీసుకుంటారు. కేవలం మెడికల్, నిత్యావసర సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీకి అనుమతి ఇచ్చారు. మొబైల్ పంపిణీ యూనిట్ల ద్వారా సాయంత్రం వరకు బియ్యం అందిస్తారు. వాలంటీర్లు కూడా పంపిణీలో సహకరించాలని సంయుక్త కలెక్టర్ సూచించారు.
ఆస్పత్రులు పెంచుతున్నా...