కోడిగుడ్లు అక్టోబరు 27న అయిపోతాయని, అంతకు రెండురోజుల ముందే ఎంఈవోకు, గుత్తేదారుకు చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పదిరికుప్పం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు. గుత్తేదారు గుడ్లను సకాలంలో పంపకపోవడంతో 28న విద్యార్థులకు ఇవ్వలేదు. 29న ఉదయం 11.30 గంటలకు గుడ్ల వివరాలు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో నమోదుకాలేదని ప్రధానోపాధ్యాయునికి విద్యాశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలకు గుత్తేదారుల నుంచి కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా కాకపోయినా.. సాంకేతిక కారణాలతో మధ్యాహ్నబోజన పథకం యాప్‌లో వివరాలు నమోదవకున్నా.. పాఠశాల విద్యాశాఖ ప్రధానోపాధ్యాయుల్నే బాధ్యుల్ని చేస్తోంది. మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు, చిక్కీలు అందించలేదని పలు జిల్లాల్లోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. యాప్‌లో నమోదైన వివరాలనే ప్రామాణికంగా తీసుకుని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థులకు గుడ్లు, చిక్కీలు అందించడం, మధ్యాహ్న భోజనం వివరాలు యాప్‌లో నమోదుచేయడంపై పలుమార్లు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది.
గుత్తేదారు ఇవ్వకపోతే ఎలా?
గుడ్లు, చిక్కీలను గుత్తేదారులు సకాలంలో పంపిణీ చేయకపోతే విద్యార్థులకు ఎలా ఇస్తామని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి ప్రశ్నించారు. వాళ్లను వదిలేసి తమను బాధ్యుల్ని చేయడమేంటని మండిపడ్డారు. ఒకోసారి గుడ్లు, చిక్కీలు అందించినా సాంకేతిక కారణాలతో యాప్‌లో నమోదు కావట్లేదని, దీనిపై నోటీసులు ఇవ్వడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకునికి ఆదివారం లేఖ రాశారు.
సీమలో 2వేల మంది ఉపాధ్యాయులకు నోటీసులు