ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అరవై ఏళ్ల అన్యోన్య బంధం.. ఒకేసారి ముగిసిన జీవిత ప్రయాణం - చావులోనూ వీడని బంధం

మూడుముళ్లు, ఏడడుగులతో నూరేళ్లు కలసి జీవిస్తామని అగ్నిసాక్షిగా ఏనాడో ఒక్కటయ్యారు. ఆమెకు తోడుగా ఆయన.. ఆయనకు తోడు ఆమె.. అలా ఆరు దశాబ్దాల దాంపత్య బంధాన్ని ముందుకు సాగించారు. కల్యాణంతో ఏర్పడిన ఆ బంధం కాటికి చేరే వరకూ అలాగే సాగింది. అనారోగ్యంతో భార్య మృతి చెందిన విషయం జీర్ణించుకోలేని భర్త.. గంటల వ్యవధిలోనే తనువు చాలించాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కప్తానుపాలెంలో జరిగింది. ఆదర్శ దంపతుల భౌతికకాయాలను సందర్శించేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు.

wife and husband death in krishna district
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి

By

Published : Jan 26, 2021, 9:04 PM IST

Updated : Jan 26, 2021, 10:45 PM IST

అరవై ఏళ్ల అన్యోన్య బంధం.. ఒకేసారి ముగిసిన జీవిత ప్రయాణం

అరవై ఏళ్ల కిందట వివాహంతో ఒక్కటయ్యారు. జీవిత ప్రయాణంలో కష్ట సుఖాలను కలిసి పంచుకున్నారు. ఇద్దరు మగ, ఆడ పిల్లల వివాహాలు చేసి తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించారు. కానీ సెంటు ఇంటి స్థలం కూడా లేని వారు...ఊరి చెరువు పక్కన గుడిసెలో జీవనం సాగిస్తూ వచ్చారు. వయసు మీద పడుతుండటంతో ఇంటి పెద్ద అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయం తెలిసిన భార్య... తన భర్త ఇక ఎక్కువ రోజులు బతుకడన్న విషయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందింది. భార్య మరణ వార్త విన్న ఆ భర్త కూడా ఆమెతోనే తన చివరి మజిలీ అంటూ ప్రాణాలను వదిలాడు.

వివరాల్లోకి వెళ్తే....

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కప్తానుపాలెంకు చెందిన అర్జున్ రావు(85), చిట్టెమ్మ(80) దంపతులు. వీరికి నలుగురు సంతానం. వారందరీ పెళ్లిలు చేశారు. సెంటి ఇంటి స్థలం లేని వారు..ఊరికి చివరన పూరి గుడిసెలో ఉంటూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా అర్జున్ రావు ఆరోగ్యం క్షీణించింది. సోమవారం అర్జున్ రావును ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు... ఇంకా ఎక్కువ రోజులు బ్రతకడు అని చెప్పారు. ఈ విషయాన్ని ఇంటి వద్దనే ఉన్న చిట్టెమ్మకు బంధువులు తెలియజేశారు. తన భర్త ఎక్కువ రోజులు బ్రతకడు అనే మాట వినేసరికి గుండె పోటుతో చిట్టెమ్మ వెంటనే మృతి చెందింది.

మరణ వార్త విన్న మరుక్షణమే...

భార్య చిట్టెమ్మ మృతి చెందిన విషయాన్ని భర్త అర్జున్ రావు దగ్గర గోప్యంగా ఉంచారు. మంచం మీద ఉన్న ఆయనకు విషయం తెలియకుండా భార్య అంతిమయాత్రకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. చివరి నిమిషంలో భర్తకు అసలు విషయాన్ని చెప్పారు. బంధవుల సహాయంతో మంచం మీద ఉన్న అర్జున్ రావు... భార్య మృతదేహాన్ని కడసారిగా చూశాడు. అంతలోనే తుది శ్వాస విడిచాడు.

భార్యాభర్తలు ఇద్దరూ గంటల వ్యవధిలో మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. 60 ఏళ్లుగా అన్యోన్యంగా జీవించారని..ఏనాడు గొడవపడిన సందర్భం లేదని గ్రామస్థులు చెప్పారు. కష్టసుఖాలను పంచుకుంటూ...కలిసిమెలిసి జీవించారని .. గ్రామంలో ఆదర్శమైన దంపతులుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఈ పుణ్య దంపతుల భౌతికకాయాలను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మధ్యనే ప్రభుత్వం ఇంటి స్థలాను మంజూరు చేయగా... ఇళ్లు కట్టుకోకుండానే లోకాన్ని వీడటం పలువురిని కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి

'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !

Last Updated : Jan 26, 2021, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details