తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలను రిజర్వేషన్ల విషయంలో పాలకులు మోసం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. వారి బతుకులేమైనా మారాయా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉందని.. అందులో 57 వేల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యిందని ఆరోపించారు. మరి ప్రభుత్వం ఏం చేస్తోందని షర్మిల ప్రశ్నించారు. వాటిని విడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? హైదరాబాద్‌లోని పాతబస్తీలో కొత్తగా ఏమైనా అభివృద్ది జరుగుతుందా? అని నిలదీశారు. లోటస్ పాండ్ లో ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని పాలకులు మాట ఇచ్చి.. దాన్ని నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడి పాలకులు ముస్లింలను ఓటు బ్యాంక్‌గా మార్చుకున్నారని.. కేంద్రంలో ఉన్న పాలకులు హేట్ బ్యాంక్‌గా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. "ఇది మారాలి, మీరే మార్చాలి అన్నారు. రాజన్న బిడ్డగా మీ పక్షాన పోరాటం చేయడానికి నేను సిద్దం" అని షర్మిల అన్నారు.