‘అమ్మమ్మా... అమ్మని అడిగితే కథ చెప్పట్లేదు. నువ్వన్నా చెప్పవా?’ అడిగింది ఏడేళ్ల శైలజ.
‘నువ్వడిగే దెయ్యాలూ భూతాల కథలేవీ నాకు తెలియవమ్మా..! నిజం కథ చెబుతా విను...’ అని చెప్పడం మొదలుపెట్టింది కల్యాణమ్మ.
‘మా నాన్న రామన్ ఒకప్పుడు బ్రిటిష్‌వాళ్ల టీ ఎస్టేట్‌లో మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. సర్కారు ఉద్యోగి కాబట్టి చుట్టు పక్కల ఉన్న జమీందార్లు మమ్మల్ని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తుండేవారు. ఓ రోజు మేమలా ఓ సంపన్నుల ఇంట్లోకి వెళుతుండగా ఆ ఊరి పెద్దలు అడ్డుకున్నారు. ‘ఈళవ’ కులంవాళ్లని ఇంట్లోకి రానిస్తావా... సిగ్గులేదూ!’ అంటూ గొడవకి దిగారు.
‘వాళ్లింటికి మనం వెళితే తప్పేమిటి అమ్మమ్మా...!’ అంది శైలజ.
‘అప్పట్లో మనం అంటరానివాళ్లమట. ఇప్పుడైతే మన ఆడవాళ్లందరూ పైటున్న చీరవేస్తున్నారు కానీ... అప్పట్లో పెద్దకులాలవాళ్లకే అది పరిమితం. మనం వేస్తే చెర్నాకోలతో కొట్టేవారు!’ అంది కల్యాణమ్మ.
‘నిన్నూ అలా కొట్టారా... !’ అడిగింది శైలజ ఆమె చుబుకాన్ని పట్టుకుంటూ.
‘అదే చెబుతున్నా... మానాన్న నన్ను పెద్ద ధనవంతుల ఇంటికే ఇచ్చాడమ్మా! కానీ పెళ్లైన పదేళ్లకే మీ తాతయ్య అనారోగ్యంతో పోయాడు. మీ అమ్మా, పెద్దమ్మలతో ఒంటరిగా మిగిలినా నేనేమీ భయపడలేదు. అది స్వాతంత్రోద్యమ కాలం. గాంధీగారు వచ్చి మనలాంటివాళ్లూ ఆలయాల్లోకి వెళ్లే హక్కు కల్పించాలంటూ పోరాటం చేస్తున్నారు. నేనూ ఆ సమావేశాలకి వెళ్లాలనుకున్నాను. ఆ రోజు పైటతో కూడిన చీర కట్టుకున్నాను. ‘తత్... తగుదునమ్మా అంటూ వితంతువులు బయటకు రావడమేంటీ..! అదీ పైటేసుకుని’ అంటూ గొడవపెట్టారు ఊరివాళ్లు. ఇద్దరు వ్యక్తులొచ్చి కదలనీయకుండా అడ్డునిలిచారు. గాంధీగారి అహింసా సిద్ధాంతం నాకు నచ్చినా... ఆ రోజు మాత్రం కోపాన్ని అణచుకోలేక పోయాను. అడ్డునిలిచినవాణ్ణి జుట్టుపట్టిలాగి ఒక్కటి పీకాను! అంతే... ఆ తర్వాత ఏ మగరాయుడూ నా పైట గురించి మాట్లాడే సాహసం చేయలేదు!’ అంది కల్యాణమ్మ. ‘భలే చేశావు అమ్మమ్మా...’ అని కిలకిలా నవ్వింది శైలజ.
******
ఆ ఏడేళ్ల పాపే కె.కె.శైలజ. తన అమ్మమ్మ కల్యాణమ్మతో ఐదేళ్ల నుంచే రాజకీయ సమావేశాలకి వెళ్లడం మొదలు పెట్టారామె. ‘అప్పట్లో అలాంటి మీటింగ్స్‌కి ఆడవాళ్లు రారు. వచ్చినా దూరంగా నిల్చుంటారు తప్ప కూర్చోరు. కానీ మా అమ్మమ్మ వెళితే ఎంత పెద్దనేతయినా లేచి ఆమెకి కుర్చీ చూపిస్తారు. బతికితే ఆమెలా గౌరవంగా బతకాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది!’ అంటారు శైలజ. అంతేకాదు ‘ఓసారి... మా ఊళ్లో మశూచి సోకింది. రోజుకి పదిమంది చనిపోతుండేవారు. వాళ్లని చూసి ఊరంతా భయపడుతున్నా... అమ్మమ్మ మాత్రం సబ్బూ, నీళ్లూ తీసుకెళ్లి వాళ్ల పుండ్లు కడిగేది. ఆ కుటుంబాలకు కావాల్సిన ఆహారధాన్యాలు పంచేది. మశూచిపట్ల కల్యాణమ్మ చూపిన ఆ ధైర్యం, కరుణా నా మనసులో నాటుకుపోయాయి’ అంటారు శైలజ.
డియర్ కామ్రేడ్స్...
కేరళలోని కన్నూరు జిల్లా ఇరిట్టి అనే కుగ్రామంలో తన అమ్మమ్మ ఇంట పుట్టి పెరిగారు శైలజ. మొదట్లో కాంగ్రెస్ నేతగా సత్యాగ్రహపోరాటంలో పాల్గొన్న వాళ్లమ్మమ్మ కల్యాణమ్మ అక్కడి జమీందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీలో తన తమ్ముళ్లతోపాటూ చేరారు. కూలీరైతులకి మద్దతుగా ఏర్పడ్డ ‘అరుణ దళం’లో సభ్యులుగా ఉన్న ఆమె తమ్ముళ్లిద్దరూ పోలీసుల తుపాకులకు బలయ్యారు. అయినా... కల్యాణమ్మ కమ్యూనిజాన్ని వీడలేదు. తన మనవరాలు శైలజచేత చిన్నప్పుడే కమ్యూనిస్టు మేనిఫెస్టో బట్టీ పట్టించారు. ‘సామాజిక చైతన్యం నీకు ఒక్కదానికే ఉంటే సరిపోదు. నీకు తారసపడ్డ ప్రతిమెదడునీ వెలిగించాలి. అందుకు నువ్వు టీచర్‌వి కావాలి!’ అనీ లక్ష్యాన్నీ నిర్దేశించారట. శైలజ తండ్రి కందన్, తల్లి శాంతలకి కల్యాణమ్మ ఎంత చెబితే అంత. ఆమె చెప్పినట్టే కూతుర్ని చదివించడం మొదలు పెట్టారు. శైలజ పదో తరగతిలోనే ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యురాలయ్యారు. బీఎస్సీలో చేరాక డీఐఎఫ్‌ఐలో చేరారు. బీఎడ్ ముగించి అమ్మమ్మ కోరికని నెరవేరుస్తూ టీచరయ్యారు. ఆ ‘టీచర్’ అన్నది ఆమె ఇంటిపేరులా మారిపోయింది!
తర్కం వీడరు...
‘ఈశ్వరా!’ అని గావు కేక పెట్టింది ఉషా టీచర్... తన ఎదుట ఉన్న విద్యార్థినిని చూసి. పదిహేనేళ్లు కూడా లేని ఆ విద్యార్థిని కళ్లు పెద్దవి చేసి చూస్తూ... బొంగురు గొంతుతో ఏదేదో మాట్లాడి వికటాట్టహాసం చేస్తోంది. పిల్లలందరూ ‘అమ్మో... దెయ్యంపట్టింది!’ అని భయంతో ఏడుస్తూ క్లాసు నుంచి పారిపోతున్నారు. పక్క క్లాసులోని టీచర్లూ వచ్చి భయంభయంగా గుడ్లప్పగించి చూస్తున్నారు. అప్పుడొచ్చారు అక్కడికి శైలజ. ‘ఎందుకిలా చేస్తున్నావ్... ఏమైంది!’ అని అనునయిస్తూ ఆ విద్యార్థిని వీపు నిమిరారు. మంచినీళ్లు తాగించారు. ఆ తర్వాత టీచర్ల దగ్గరకొచ్చి ‘దెయ్యాలూ భూతాలేమీ లేవు... ఇదో సైకాలజికల్ సమస్య అంతే!’ అని చెప్పి తనకి తెలిసిన సైకియాట్రిస్టు ద్వారా మూడునెలల్లో ఆ పాపని మామూలు మనిషిని చేశారు. ‘శైలజ ఎప్పుడూ అంతే! మిన్నువిరిగి మీదపడ్డా తార్కికంగానే ఆలోచిస్తుంది...’ అంటారు ఒకప్పటి ఆమె సహోద్యోగిని ఉషా టీచర్. టీచర్‌గా నంబర్‌వన్ అనిపించుకున్నా డివైఎఫ్‌ఐ నేతగానూ క్రియాశీలకంగా ఉండేవారు శైలజ. ఆ తర్వాత జిల్లా కమిటీ సభ్యురాలయ్యారు. ఆ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటూ వచ్చిన భాస్కరన్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఐదుగురి మరణం...
1994... కేరళ కాంగ్రెస్ మంత్రి ఒకరు కన్నూరులో సమావేశానికి వచ్చారు. డివైఎఫ్‌ఐ విద్యార్థులు ఆయనకి వ్యతిరేకంగా ఆందోళనకి దిగారు. తప్పెవరిదో తెలియదుకానీ పరిస్థితులు మాత్రం అదుపుతప్పాయి. పోలీసుల కాల్పుల్లో శైలజ సహచరులు ఐదుగురు బలయ్యారు. దాంతో ఆ ప్రాంతంలో తాము కమ్యూనిస్టులమని చెప్పుకునేవాళ్లే కరవయ్యారు. ఆ నేపథ్యంలోనే 1996 ఎన్నికలొస్తే శైలజ పోటీకి దిగారు. తనకి అంగబలం, అర్థబలం ఏమీ లేకున్నా... గడపగడపకూ వెళ్లి ఓట్లడిగి గెలిచారు. ఆ తొలి అడుగే ఆమెని మరో పదేళ్లకి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని చేసింది. మంత్రి కాగానే గ్రామీణ స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ప్రైవేటు ఆసుపత్రులకన్నా మిన్నగా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. స్త్రీలే ప్రజారోగ్యాన్ని చక్కగా చూసుకుంటారనేమో వైద్య ఆరోగ్యశాఖ, వైద్యవిద్యా విభాగాలకి డైరెక్టర్‌లుగా మహిళలని నియమించారు. అంతేకాదు, కేరళలోని 14 జిల్లాలకుగాను 11 జిల్లాల్లో మహిళలకే జిల్లా వైద్యాధికారులుగా బాధ్యత అప్పగించారు. గ్రామంలో ఎవరికి ఏ తీవ్ర సమస్య వచ్చినా ఆశావర్కర్ల నుంచి జిల్లా వైద్యాధికారిదాకా తక్షణం స్పందించేలా ఓ మహిళా నెట్‌వర్క్‌ని ఏర్పాటుచేశారు. దీన్ని ‘పెన్ పడ’(ఆడవాళ్ల దండు) అని వెక్కిరించేవారు ప్రతిపక్షంవాళ్లు. కానీ ఆ దండే ప్రాణాంతక ‘నిపా వైరస్’ కేరళని కబళించకుండా అడ్డుకుంది.
కట్టడిచేశారంతే...!
2018... మే 18. గోవాలోని మణిపాల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి శైలజకి ఫోన్ వచ్చింది... ‘మేడమ్! కోళిక్కోడు జిల్లాలో వింత జ్వరంతో చచ్చిపోయిన ఇద్దరికి నిపా వైరస్ ఉంది!’ అని చెప్పారు. దక్షిణాదిలో నిపా బయటపడటం అదే మొదలు. ‘ఆరోజు నాకూ ఆ వైరస్ గురించి ఏమీ తెలియదు. కోళిక్కోడు వెళుతూ ఆన్‌లైన్ ద్వారానే అన్నీ తెలుసుకున్నా. అది సోకితే బతికే అవకాశం 25 శాతమే ఉంటుందని అర్థమైంది. నిపా సోకిన వ్యక్తులు రెండువారాల నుంచి ఎక్కడెక్కడెక్కడికి వెళ్లారు... వాళ్ల ద్వారా ఎంతమందికి సోకి ఉండొచ్చు... ఇవన్నీ తెలుసుకోవాలి, ఎలా... అన్న ప్రశ్నే నన్ను తొలిచేసింది!’ అని గుర్తుచేసుకుంటారు శైలజ. అప్పటికప్పుడు అక్కడికక్కడే తన నేతృత్వంలో ఉన్నతాధికారులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటుచేశారు. నిపా పైన టీవీల్లో విస్తృతంగా ప్రచారం కల్పించారు. ‘కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్’(సీటీఎస్) పేరుతో ప్రత్యేక ‘కాల్ సెంటర్’ని రూపొందించారు. రోగుల స్వగ్రామంలోనూ, చుట్టుపక్కల్లోనూ వాళ్లకి దగ్గరగా వెళ్లినవాళ్లూ... లక్షణాలు ఉన్నవాళ్లూ తమకి ఫోన్ చేయాలని సూచించారు. రాత్రంతా తానూ ఫోన్‌లు అటెండ్ చేస్తూనే ఉన్నారు. అలా 24 గంటల్లో 2000 మంది ‘వైరల్ అనుమానితుల్ని’ గుర్తించారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న 18 మందిని ఆసుపత్రికి తరలించారు. చికిత్సకి కచ్చితమైన మందులేవీ లేవు. హైదరాబాద్‌కి చెందిన ఓ ఫార్మా కంపెనీ ‘నెపావెరైన్’ అనే మందునిస్తే ప్రయోగాత్మకంగా వాటితోనే చికిత్స చేశారు. ఇదిలా ఉంటే, నిపాతో చనిపోయిన రోగుల గ్రామం భయంతో వణికిపోయింది. ఊళ్లోవాళ్లందరూ అక్కడి నుంచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అదే జరిగితే... వాళ్ల వల్ల వైరస్ మిగతా చోట్లకీ పాకే ప్రమాదముంది. దాంతో అధికారులు వారిస్తున్నా వినకుండా శైలజ ఆ గ్రామానికి వెళ్లారు. వాళ్లకి తానున్నానంటూ భరోసా ఇచ్చి... గ్రామస్థుల భయం పోగొట్టడంతో ఎవరూ ఊరుదాటలేదు. మరోవైపు, మరణాలు కనీసం 200 దాకా ఉంటాయన్న అంచనాలు తలకిందులై... పదహారుకే పరిమితమయ్యాయి. వ్యాధి సోకిన ఇద్దరు పూర్తిస్థాయిలో కోలుకోగలిగారు. వైరస్ బయటపడ్డ కేవలం పాతికరోజుల్లో ‘మేం నిపాని జయించేశాం!’ అని ప్రకటించగలిగారు శైలజ. ఆ పాతిక రోజుల సంఘటనలనే ‘వైరస్’ సినిమాగా తీశారు. శైలజ పాత్రని ప్రముఖ నటి రేవతి పోషించారు.
మరో ఛాలెంజ్...
2020 జనవరి మొదటి వారంలోనే చైనాలోని వుహాన్‌లో వ్యాపిస్తున్న కరోనా గురించి అన్ని వివరాలూ సేకరించారు శైలజ. కేరళ నుంచి వెళ్లి అక్కడ మడిసిన్ చదువుతున్న విద్యార్థినులు సొంతూరికి వస్తున్నారని తెలిసి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వచ్చినవారిలో ఒక విద్యార్థినికి కరోనా ఉన్నట్టు తేలింది. మనదేశంలో అదే తొలి కేసు. ఆ తర్వాత ఇటలీలో కేసులు ఎక్కువగా ఉండటంతో, అక్కడి నుంచి కేరళ వచ్చేవాళ్లని క్వారంటైన్‌లో పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఓ కుటుంబం మాత్రం తాము ఇటలీ నుంచి రావట్లేదని అబద్ధం చెప్పి... జనాల్లో కలిసిపోయింది. వాళ్లద్వారా 516 కేసులు బయటపడ్డాయి. ఆ పరిస్థితినీ తమ ‘కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్’తో మళ్లీ అదుపులో పెట్టగలిగారు శైలజ. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి దాకా ఉన్న నెట్‌వర్క్, హాస్పిటల్ ప్రోటోకాల్స్ ద్వారా మరణాల రేటుని 0.036కి తగ్గించారు! దీనికే ‘కేరళ మోడల్’గా అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఐరాస ఆమెని ప్రత్యేకంగా సన్మానించింది. విదేశీ పత్రికలన్నీ ‘రాక్‌స్టార్’గా ఆమెని ఆకాశానికెత్తాయి. వోగ్ పత్రికయితే ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అంటూ ముఖచిత్ర కథనం ప్రచురించింది. లండన్‌కి చెందిన ప్రాస్పెక్ట్ పత్రిక ఆమెని ‘కొవిడ్-19 టాప్ థింకర్’గా కీర్తించింది. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆడర్న్‌కీ శైలజ తర్వాతి స్థానమే ఇవ్వడం విశేషం!
చరిత్రాత్మక విజయం...
ప్రపంచమంతా మెచ్చిన తమ మంత్రిని కేరళ ప్రజలు మాత్రం తక్కువగా చూస్తారా! ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుమారు 60 వేల మెజార్టీతో ఆమెని గెలిపించారు. కేరళలో ఇప్పటిదాకా అంత మెజారిటీతో గెలిచినవాళ్లెవరూ లేరు! ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినరయి విజయన్ తన కొత్త క్యాబినెట్‌లో పాత మంత్రులెవరికీ చోటివ్వలేదు... ఒక్క శైలజకి తప్ప. మళ్లీ ఆమెకే వైద్యఆరోగ్యశాఖని అప్పగించే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే జరిగితే- కరోనా సెకండ్ వేవ్ అన్ని రాష్ట్రాల్లాగే కేరళనీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రస్తుత తరుణంలో శైలజ ఆధ్వర్యంలోని ‘మహిళా దండు’ ఈ కొత్త సవాలుని ఎలా ఎదుర్కొంటుందోనని దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది!
ఇదీ చూడండి: