ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sexual Harassment: 'నా కోరిక తీర్చితే... దస్త్రం మీద సంతకం చేస్తా' - ఒప్పంద ఉద్యోగిపై లైంగిక వేధింపులు

Sexual Harassment: మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో అనే తేడా లేకుండా కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఒప్పంద మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే?

Sexual Harassment
మహిళపై లైంగిక వేధింపులు

By

Published : May 14, 2022, 7:52 AM IST

Sexual Harassment: ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ఒప్పంద విధానంలో అదే శాఖలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. తన ఉద్యోగాన్ని కొనసాగించే దస్త్రం మీద సంతకం పెట్టేందుకు కోరిక తీర్చాలని తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆ అధికారి మాటలతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని మెదక్​ జిల్లాలో మార్చి 30న జరిగిన ఈ వ్యవహారం తాజాగా బయటకొచ్చింది.

‘పని, బిల్లులిచ్చే విషయంలో నిన్ను ఏడాదికాలంగా ఇబ్బంది పెట్టాను. అదంతా మరిచిపో. నిన్ను ఉద్యోగంలో కొనసాగించే దస్త్రం మీద సంతకం చేస్తా. నువ్వు చేయాల్సిందల్లా నా కోరిక తీర్చడమే. అలా చేస్తే నీకు ఏ కష్టం రాకుండా మహరాణిలా చూసుకుంటా. ఉద్యోగ విధులూ పెద్దగా లేకుండా చూస్తా’ - మెదక్‌ జిల్లా సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి

‘నేను ఒప్పంద పద్ధతిన సంక్షేమశాఖలో పనిచేస్తున్నా. మమ్ముల్ని కొనసాగించేలా ఏడాదికోసారి జిల్లా స్థాయిలో అధికారులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులు మమ్ముల్ని కొనసాగిస్తారు. ఇదే విషయమై దస్త్రం మీద సంతకం చేయాలని విజ్ఞప్తి చేసేందుకు మరో మహిళా ఉద్యోగితో కలిసి మార్చి 30న కార్యాలయానికి వెళ్లా. అక్కడికి వెళ్లాక... నాతో మాట్లాడుతానని చెప్పి నా సహోద్యోగిని ఆ అధికారి పంపించేశారు. డబ్బు అడుగుతారేమో అనుకున్నా. కానీ ఆయన నోటి నుంచి నేను ఊహించని మాటలు వచ్చాయి. సంతకం పెడతానని, కానీ రేపు ఉదయం ఒకసారి మీ ఇంటికి వస్తా. నా కోరిక తీర్చు అని మాట్లాడాడు. ఒక్కసారిగా నాకేం చేయాలో అర్థం కాలేదు. సర్‌.. మీరు నా తండ్రిలాంటి వారు.. అలా మాట్లాడొద్దు అని బతిమిలాడా. అయినా ఆఫీసుల్లో ఇలాంటివన్నీ మామూలు విషయాలే.. ఇలా ఉంటేనే అన్ని పనులూ జరుగుతాయి.. నువ్వేం కంగారుపడకు అంటూ పదే పదే అలాంటి మాటలతో నన్ను వేధించాడు. ఉన్నతాధికారులు న్యాయం చేయకపోతే ఎంతవరకైనా పోరాడతా’- బాధిత మహిళ

తన పట్ల ఆ అధికారి వ్యవహరించిన తీరును బాధిత మహిళ విలపిస్తూ చెప్పుకొచ్చింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యను కలిసి గోడు వెల్లబోసుకున్నానని, ఆమె సూచనల మేరకు జిల్లాస్థాయిలో కమిటీ విచారణ చేపట్టిందని చెప్పారు. ఏప్రిల్‌ 5న సదరు కమిటీ తనను పిలిపించిందని తెలిపారు. మార్చి 30న ఏం జరిగింది, గతేడాది కాలంగా ఆ అధికారి తనను ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనేది కమిటీకి వివరించారు. ఇదంతా జరిగి నెల గడిచిపోయినా అధికారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. విచారణ చేపట్టిన కమిటీ సభ్యుల్లో కీలకమైన ఒక అధికారిణితో మాట్లాడగా... ఈ విషయమై తానేమీ మాట్లాడనని చెప్పారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details