Harassments In Work Place: ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగిణి. సహోద్యోగి తరచూ ద్వందార్థాల మాటలు.. గుచ్చి గుచ్చి చూసే చూపులతో వేధించేవాడు. ఎన్నిసార్లు సున్నితంగా చెప్పి చూసినా మార్పు రాకపోగా.. శృతిమించాడు. అతడి పోరుపడలేక.. ఆమెకు కార్యాలయానికి వెళ్లాలంటేనే దిగులు పట్టుకునేది. ఇది ఒక దగ్గర అయితే మరోచోట.. ఆమె ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఆమె పై అధికారి సమావేశమంటూ తన గదికి పిలిపించి.. మాట్లాడుతూనే కంప్యూటర్లో అసభ్య చిత్రాలు తెరిచేవాడు. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి.. ఆమె అందం గురించి వర్ణిస్తుంటే.. ఉద్యోగినికి ఎబ్బెట్టుగా ఉండేది. కార్యాలయంలో అందరి ముందు అలాంటి ప్రవర్తనే. ఆ వేధింపుల బాధ పడలేక మరో నగరానికి బదిలీ చేయించుకుంది. ఇలానే తాజాగా నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేటలో మండల అధికారి.. గంగపట్నంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగితో అసభ్యకర మాటలతో లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తట్టుకోలేక కుటుంబ సభ్యులకు తెలపడంతో సదరు అధికారికి దేహశుద్ధి చేశారు.
అనేక కార్యాలయాలు, పని ప్రదేశాల్లో ఉద్యోగిణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధింపులు తప్పడం లేదు. చెప్పుకొంటే పరువు పోతుందనో.. ఉపాధికి నష్టమనో.. భయంతో ఎంతో మంది మౌనంగా భరిస్తుండగా- ఆ పరిస్థితిని అలుసుగా తీసుకునే కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. తొలుత మాటలతో ఆరంభించి.. తర్వాత ఒత్తిళ్లు, చివరకు వేధింపులు.. బెదిరింపులకూ వెనుకాడటం లేదు. జిల్లాలో గతంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేధింపుల ఉదంతాలు వెలుగు చూశాయి. ‘తప్పంతా మీదే. సర్దుకుపోకుండా, ఆఫీసు పరువు బజారుకీడుస్తారా?’ అని ఉన్నతాధికారులు బాధితులనే తప్పుపట్టడం ఈ కేసుల్లో సహజంగానే జరుగుతోంది. స్త్రీ- పురుషులు కలిసి ఒకే చోట పని చేస్తున్నప్పుడు చవకబారుగా ఆలోచించే సహచరులు, ఉన్నత స్థాయి అధికారుల వల్ల వేధింపుల ఘటనలు తలెత్తుతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతారు.
2013 చట్టంతో ‘కమిటీ’కి ప్రాణం..దిల్లీలో నిర్భయ సంఘటన అనంతరం.. కేంద్రం 2013లో ‘పని ప్రదేశాల్లో ఉద్యోగినుల లైంగిక వేధింపుల నిరోధక చట్టం- 2013ను అమల్లోకి తెచ్చింది. 10 మంది, ఆపై ఉద్యోగినులున్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో తప్పనిసరిగా ఈ కమిటీలు ఏర్పడాలి. బాధితుల ఫిర్యాదుల మేరకు దుందుడుకు ఉద్యోగుల అఘాయిత్యాలపై కమిటీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా వ్యవస్థను నడిపించాలి.
కానరాని నిరోధక కమిటీలు
ఆరంభంలో సమావేశాలతో హడావుడి జరిగినా.. జిల్లాలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలోనూ ఈ కమిటీలు పురుడుపోసుకోలేదన్నది నిష్ఠూర సత్యం. నెల్లూరులో వాకబు చేసినా.. పలు కార్యాలయాల్లో అలాంటి కమిటీల గురించి తమకు తెలియదని కొందరు శాఖాధిపతులు పేర్కొనడం గమనార్హం.
పలు రూపాల్లో...
*నేరుగా చేయి పట్టుకుని దౌర్జన్యం చేయడమొక్కటే వేధింపులు కావు. దూరం నుంచే సూటిపోటి మాటలు, సైగలు కూడా మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసేవే.
*శారీరకంగా తాకడం, సన్నిహితంగా మసలడం
*లోబర్చుకునే ఉద్దేశంతో బలవంతంగా కానుకలు ఇవ్వజూపడం
*ద్వంద్వార్థ సంభాషణలు, వ్యాఖ్యలు విసరడం