ఎయిడెడ్ విద్యా సంస్థలను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోకుండా వాటికి సాయం నిలిపివేతకు తెచ్చిన సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని దీనిపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని ఉపాధ్యాయ, స్వతంత్ర, భాజపా ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మండలిలో బుధవారం ఎయిడెడ్ విద్యా సంస్థల సవరణ బిల్లును మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్సీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే బిల్లుకు మండలిలో ఆమోదం లభించింది.
* ‘దేశవ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 2.70 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిపై ఏం చేయాలనేది ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకొనుంటే బాగుండేది. తొలుత రెండు, తర్వాత మరో రెండు ఆప్షన్లు ఇచ్చారు. ప్రభుత్వానికి తల బొప్పికట్టింది. ఎయిడెడ్ వదులుకున్న యాజమాన్యాల చేతుల్లోనే విద్యాసంస్థలను పెడుతున్నారు. ఇలాంటి అర్థరహితమైన బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ విద్యా సంస్థలను పరిపుష్ఠం చేయడంగానీ, నిర్ణయంపై పునఃసమీక్షగానీ చేయాలి’ అని విఠపు బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు.
* ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ఎయిడెడ్ సంస్థలను మూసేస్తే, వాటిలో చదివే విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎందుకు దృష్టిపెట్టలేదు?’ అని లక్ష్మణరావు ప్రశ్నించారు.
* ‘విశాఖలోని జింక్ పాఠశాల 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలి. మానవతా దృక్పథంతో బిల్లు ఉపసంహరించుకోవాలి’ అని రఘువర్మ కోరారు.
* ‘వ్యవస్థలో లోపాలుంటే సవరించాలి. ఎయిడెడ్ వ్యవస్థను పునరుద్ధరించాలి. ఈ బిల్లుపై పునఃసమీక్షించాలి’ అని భాజపా పక్షనేత మాధవ్ డిమాండ్ చేశారు.