అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండే వారి సంక్షేమం కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ... సెవెన్ రేస్. నగరవ్యాప్తంగా ఎన్నో ఆశ్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలనే తపన గల సారా ఆలోచనల్లో నుంచి పుట్టి, ఆచరణలో ఎందరో కడుపు నింపుతోంది...సెవెన్ రేస్.
చదువుకు దూరమవుతున్నారని తెలిసి..
హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన సారా ఐటీ ఉద్యోగం చేస్తోంది. ఇటీవల కాలంలో లాక్‌డౌన్ కారణంగా పనులు కోల్పోయి బతుకే కష్టంగా మారిన పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. ఆ క్రమంలో, బస్తీల్లో ఉండే పిల్లలు ఫీజులు కట్టలేక చదువుకు దూరమవుతున్నారని తెలుసుకుంది. ఒక పూట అన్నం పెడితే ఆ పూట వరకే, అదే నిత్యం అన్నం సంపాదించుకునే శక్తినిస్తే వారే మరో పదిమందికి బాసటగా నిలుస్తారు. ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన సారా, ఆ కుటుంబాల్లోని పిల్లలకు మంచి విద్యను అందించేందుకు శ్రమిస్తోంది.
కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి..
సెవెన్ రేస్ సంస్థ ద్వారా పదో తరగతిలో 9.5 పాయింట్లు సాధించిన పేదింటి విద్యార్థుల్ని కార్పొరేట్ కళాశాలల్లో చేర్పిస్తోంది. ఫలానా కళాశాలలోనే చదువుతామని విద్యార్థులు కోరుకుంటే ఎంత వ్యయం అయినా... దాతల సహకారంతో ఆ దిశగా సారా ప్రయత్నిస్తోంది. విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించే ఈ కార్యక్రమానికి సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. 'ఈ విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించాడు. కళాశాలలో చేరడానికి డబ్బులు లేవు. ఈ యువ ప్రతిభావంతుడికి ఆర్థిక సహకారం అందిచాలి. అని పోస్ట్ చేస్తే చాలు.! ఎంతో మంది ముందుకు వచ్చి తమ దాతృత్వం చాటుకుంటున్నారు. విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.
సాయాన్ని ఎప్పటికీ మరువం..
ఒక్కరితో ప్రారంభమైన ఈ కార్యక్రమం 25మందికి పైగా విద్యార్థులకు కార్పొరేట్ విద్యను చేరువ చేసే స్థాయికి చేరింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఒంటరి మహిళల పిల్లలు, తండాల్లోని నిరుపేద విద్యార్థులు ప్రయోజనం పొందిన ఈ జాబితాలో ఉన్నారు. పిల్లల్ని గొప్ప చదువులు చదివించాలనే కోరిక బలంగా ఉన్నా, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి... నిరుపేదలదీ. ఈ నేపథ్యంలో... తమ పిల్లలకు వెలుగుబాట చూపిన సెవెన్ రేస్ సంస్థ అందించిన సాయాన్ని ఎప్పటికీ మరువమంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ..
సెవెన్ రేస్ సంస్థ ఇటీవల నగర శివార్లో ఉన్న రెండు తండాల్ని దత్తత తీసుకుంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ ప్రాంతాల్లోని పిల్లలకు మెరుగైన విద్యకు కృషి చేస్తోంది. అలాగే, మహిళల స్వయం ఉపాధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని సెవెన్ రేస్ వ్యవస్థాపకురాలు సారా చెబుతోంది. అమ్మ... నేను ఆ కోర్సు చదువుతాను. నాన్నా... నేను ఈ కళాశాలలో చదువుతాను అని అడగలేని పరిస్థితిలో.. బస్తీ విద్యార్థులుంటారు. ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తూ.. ఉన్నత చదువులు చదవాలనే తమ ఆశను ఆదిలోనే వదిలేసిన తరుణంలో సెవెన్ రేస్ సంస్థ చేయూత అందించటం పట్ల ఈ రేపటి పౌరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పేద వారిని చూసి జాలిపడి డబ్బులు దానం చేయడం కాదు.. వారి స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేయాలని సారా తన సేవా కార్యక్రమాలతో నిరూపిస్తోంది. మరింత మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నలుగురితో కలిసి ముందుకు సాగుతోంది.
మన 'సారా' సేవ చేస్తోందీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇదీ చూడండి:ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల