ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వెనుకంజ! - industries

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బయటి నుంచి వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. స్థానిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినా వివిధ కారణాలతో ప్రభుత్వమే వారిని నిరాశపరుస్తుందనే విమర్శలొస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల్లో భూములను కేటాయిస్తే.. తక్కువ ధరకు కేటాయించారన్న పేరుతో వాటిని రద్దు చేయడమే ఎజెండాగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పని చేస్తోంది. ఇది పారిశ్రామిక వేత్తలపై కక్ష సాధింపేనని.. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వెనుకంజ
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వెనుకంజ

By

Published : Jul 25, 2022, 9:25 AM IST

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బయటి నుంచి వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. స్థానిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినా వివిధ కారణాలతో ప్రభుత్వమే వారిని నిరాశపరుస్తుందనే విమర్శలొస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల్లో భూములను కేటాయిస్తే.. తక్కువ ధరకు కేటాయించారన్న పేరుతో వాటిని రద్దు చేయడమే ఎజెండాగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పని చేస్తోంది. ఇది పారిశ్రామిక వేత్తలపై కక్ష సాధింపేనని.. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ విధానాలు లేవని పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో (1,165.73 ఎకరాల్లో) చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు 612 మందికి కేటాయించిన ప్లాట్లలో.. సుమారు 445 మందికి సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేయడానికి వీలుగా ఏపీఐఐసీ నోటీసులు జారీ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది.

ఒక్కోసారి.. ఒక్కో కారణం
పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన ఏపీఐఐసీ ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలా లాభాపేక్షతో పని చేస్తోంది. గతంలో చదరపు మీటరుకు నిర్దేశించిన ధర రూ.408 చాలా తక్కువని, ప్రస్తుతం సవరించిన ధర ప్రకారం చ.మీకు రూ.2,204 చెల్లించాలని పేర్కొంటోంది. నాలుగేళ్ల కిందటే పూర్తి మొత్తాన్ని చెల్లించారన్న ఉద్దేశంతో రాయితీ ధర కింద చ.మీకు రూ.1,627 వంతున చెల్లించడానికి సిద్ధపడిన వారికే భూములిస్తామని.. ఆసక్తి లేకుంటే అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని వెనక్కి తీసుకుని వైదొలగాలని పారిశ్రామిక వేత్తలకు ఏపీఐఐసీ సూచిస్తోంది. భూ కేటాయింపుల రద్దు నోటీసుల్లో ఒక్కోసారి ఒక్కో కారణాన్ని చూపింది. పూర్తి మొత్తాన్ని చెల్లించి విక్రయ ఒప్పందం కుదుర్చుకోని కారణంగా 175 మంది కేటాయింపులను రద్దు చేస్తూ మొదటిసారి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కోర్టు కేసులు, రాళ్ల గుట్టలు, లోతైన గుంతలు ఉన్నాయనే కారణంతో 170 మంది కేటాయింపులను రద్దు చేస్తూ నోటీసులిచ్చింది. తాజాగా పూర్తి మొత్తం చెల్లించినా.. విక్రయ ఒప్పందం కుదుర్చుకోని 100 మందికి నోటీసులిచ్చింది. పారిశ్రామిక పార్కులో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంవల్ల ఏపీఐఐసీకి రూ.288 కోట్ల నష్టం వచ్చిందని.. దీని భర్తీకి సవరించిన కొత్త ధరల ప్రకారం చెల్లిస్తేనే ఒప్పందాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. అంటే గతంలో కట్టిన డబ్బు మినహాయించుకున్న తరవాత కొత్త ధర ప్రకారం ఎకరానికి రూ.65,84,469 వంతున పారిశ్రామికవేత్తలు చెల్లించాలి. ఈ లెక్కన రూ.49.34 లక్షల అదనపు భారం వారిపై పడుతుంది.

ప్రభుత్వ నిర్ణయమే కారణం
సాధారణంగా పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ఏపీఐఐసీపై ఉంటుంది. ఈ వ్యయాన్ని కలుపుకునే ప్లాట్ల ధరలను నిర్ణయిస్తుంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో 2018లో ప్లాట్లను కేటాయించే సమయంలో చదరపు మీటరు రూ.408 వంతున.. ఎకరానికి రూ.16.5 లక్షల ధరను నిర్దేశించింది. ఈ ప్రకారం నాలుగేళ్ల కిందటే పారిశ్రామికవేత్తలు చెల్లించారు. ఇప్పుడు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంవల్ల రూ.288 కోట్లు నష్టం వచ్చిందని, దీన్ని ప్రభుత్వం భరించడానికి అంగీకరించలేదని పేర్కొంటోంది. కాబట్టి, పారిశ్రామికవేత్తల నుంచి రాబట్టుకోవడం మినహా మార్గం లేదని నోటీసుల్లో పేర్కొంది.

భూముల ధరల పెంపుపై అసంతృప్తి
ఈ పార్కును 1,360 ఎకరాల్లో అభివృద్ధి చేయడంవల్ల రూ.288 కోట్ల నష్టం వచ్చినట్లు పేర్కొంది. అంటే ఏపీఐఐసీ లెక్క ప్రకారం.. ఎకరానికి సగటున రూ.21.17 లక్షల నష్టం వస్తోంది. 2018లో ప్లాట్ల కేటాయింపు సమయంలో పారిశ్రామికవేత్తల నుంచి ఎకరాకు రూ.16.5 లక్షల వంతున వసూలు చేసింది. ఇప్పుడు ఏపీఐఐసీ నష్టం వచ్చిందని చెప్పిన మొత్తంతో కలిపినా ఎకరానికి రూ.37.67 లక్షలకు (రూ.21.17 లక్షలు+రూ.16.5 లక్షలు) మించదు. ఏపీఐఐసీ ప్రస్తుతం నిర్దేశించిన కొత్త ధర ప్రకారం ఎకరం కొనాలంటే రూ.89,19,588 చెల్లించాలి. ఈ విధంగా చూసుకుంటే ఎకరానికి రూ.51.52 లక్షలు ఏపీఐఐసీకి లాభం వచ్చేట్లుగా ఉండటం గమనార్హం. ఈ స్థాయిలో భూముల ధరలను పెంచడంపై పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details