Service Sector in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సేవల రంగం వృద్ధిరేటు భారీగా పడిపోయింది. గత మూడేళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతోంది. 2018-19లో 8.24%, 2019-20లో 6.20%గా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధిరేటు 2020-21లో మైనస్ 6.71%కి పడిపోయినట్లు సోమవారం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే వెల్లడించింది. రాష్ట్ర స్థూల అదనపు విలువలో ఈ రంగం వాటా 2018-19లో 42.25% ఉండగా, 2019-20లో అది 41.86%, 2020-21లో 41.64%కి పడిపోయింది. తెలంగాణలోనూ సేవల రంగం వృద్ధిరేటు మూడేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. 2018-19లో 7.91% ఉన్న ఈ వృద్ధిరేటు 2019-20లో 5.69 శాతానికి చేరింది. 2020-21లో అది ఏకంగా మైనస్ 3.94 శాతానికి పడిపోయింది.
* ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పారిశుద్ధ్య వాతావరణంలో జీవించే వారి సంఖ్య తగ్గిపోయింది. చక్కటి పారిశుద్ధ్య వసతులున్న ఇళ్లలో నివసించే జనసంఖ్య 2015-16 ఆరోగ్య సర్వే-4 ప్రకారం 77.3% ఉండగా 2019-21 ఆరోగ్య సర్వే-5 నాటికి 54.4%కి పడిపోయింది. వంట కోసం శుద్ధ ఇంధనం వాడే కుటుంబాల సంఖ్య ఇదివరకు 83.6% ఉండగా, తాజాగా 62%కి పడిపోయింది.
* ఏపీలో శిశుమరణాలు 34.9 నుంచి 30.3కి తగ్గిపోయాయి. అయిదేళ్లలోపు పిల్లల మరణాలు ఇదే సమయంలో 40.8 నుంచి 35.2కి తగ్గాయి. పొత్తిళ్లలోని పిల్లల (1 నుంచి 28 రోజుల్లోపు వయస్సున్న పిల్లలు) మరణాలు మాత్రం 19.9 నుంచి 23.6కి పెరిగాయి.
* ఆరోగ్య సర్వే 4-5ల మధ్యకాలంలో ఏపీలో సంతానసాఫల్య రేటు (ప్రతి మహిళకు జన్మించే పిల్లల సంఖ్య) 1.8 నుంచి 1.7కి తగ్గిపోయింది. లింగనిష్పత్తి 914 నుంచి 934కి పెరిగింది.
* విశాఖ పోర్టులో సరకు రవాణాకు వెచ్చించే రోజులు దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ ఒక్కో నౌక టర్న్ అరౌండ్ (సరకు లోడింగ్, అన్‌లోడింగ్)కు సగటున 3.15 రోజులు పడుతోంది. కోల్‌కతా, మర్మగోవా, వైజాగ్ పోర్టులు తప్ప దేశంలోని మిగిలిన అన్ని పోర్టుల్లో అత్యధిక సరకు రవాణా ట్రాఫిక్ నమోదైంది.
ఇదీ చదవండి :ap government: ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
* 2022-25 మధ్యకాలంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేటీకరణ(మానిటైజ్) చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
* లక్ష హెక్టార్లలో ప్రకృతి సేద్యంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్, తమిళనాడు ఉన్నాయి.
* నీతిఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020-21లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. దేశంలోని కోస్తా రాష్ట్రాలపరంగా చూస్తే ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొంది.
* ఆంధ్రప్రదేశ్, బిహార్‌లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ కొన్ని నెలలుగా కొవిడ్ ముందుకాలం నాటి కంటే తగ్గిపోయింది. బయటి ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రాలకు కార్మికులు వలస వచ్చినచోట పెరిగితే, సొంతరాష్ట్రాల నుంచి బయటి రాష్ట్రాలకు కార్మికులు వలస వెళ్లినచోట డిమాండ్ తగ్గింది.