అందరినీ రక్షించేవాడు దేవుడని భక్తుల విశ్వాసం. అందరూ తమ రక్షణ, కష్టాలు తీర్చమని ఆలయాలకు వెళ్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఆలయాల్లోని దేవతామూర్తులు, ఆస్తులను కాపాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు చూసి భక్తులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు. రాష్ట్రంలో గతంలోనూ ప్రాచీన దేవాలయాలు, పవిత్ర విగ్రహాలకు అపచారం వాటిల్లింది. గుప్త నిధుల అన్వేషణ, స్మగ్లింగ్ అవసరాల కోసం ఆయా ఘటనలు అప్పట్లో జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు.. అలాంటి ప్రయోజనం కోసం కాదనేది స్పష్టంగా కనిపిస్తోంది.
గతేడాది జనవరిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పలు హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఫిబ్రవరి నెలలో నెల్లూరు ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ రథం దగ్ధమైంది. ఆ తర్వాత అనేక చిన్న ఆలయాల్లో ఈ తరహా ఉదంతాలు జరిగాయి. సెప్టెంబరు నెలలో కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట దగ్గరిలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం నంది విగ్రహం ధ్వంసమయ్యింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అగర మంగళం అభయాంజనేయస్వామి దేవాలయంలోని నంది విగ్రహం ధ్వంసం జరిగింది. అదే నెలలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధం పెను వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై అధికారపక్షం మినహా అన్ని రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తామంటూ కేంద్రానికి లేఖ రాయడంతోనే సరిపుచ్చింది. దగ్ధమైన రథం స్థానంలో కొత్త రథం నిర్మాణం చేయిస్తోంది. ఇంతవరకు ఈ ఘటనలో బాధ్యులు ఎవరనేది తేల్చలేదు. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను వేసినా పురోగతి కనిపించలేదు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం అయింది. కృష్ణాజిల్లా నిడమానురులోనూ సాయిబాబా విగ్రహం ధ్వంసం జరిగింది.
ఎవరి పని..ఎందుకు జరుగుతున్నాయి..?
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ ఉత్సవ రథానికి చెందిన మూడు వెండి సింహం విగ్రహాలు మాయమయ్యాయి. 2020 ఏడాది చివరిలో విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో అమ్మవారి విగ్రహం పాదాలను ధ్వంసం చేశారు. తాజాగా ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలోని శ్రీరాముడి విగ్రహం తల నరికివేత ఇప్పుడు పెను సంచలనమైంది. అంతకుముందు తర్వాత కూడా ఈ తరహా ఘటనలు ఆగడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే తూర్పుగోదావరి జిల్లా రామమహేంద్రవరంలోని శ్రీరాంనగర్‌లోని విఘ్నేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రెండు చేతులు విరిచేయడం భక్తులను కలవరపెడుతోంది. విజయవాడలో సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహం ధ్వంసం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఆకతాయిలా..? మతిస్థిమితం లేని వ్యక్తులా..? ఓ పని కట్టుకుని చేస్తోన్న ప్రత్యేక ముఠాలా.. ? ఈ ప్రశ్నలకు దర్యాప్తు సంస్థల నుంచి సమాధానం లేదు. అనుమానితుల పేరిట అనేకమందిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ సాగిస్తున్నా వారికి ఆధారాలు లభించడం లేదు.
భాజపా-జనసేనల సంయుక్త పోరాటం...
విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేసిన ఘటనలో... స్వామి ఒంటి మీది వెండి ఆభరణాల జోలికి పోలేదు. ఆయన తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేశారు. ఈ ఒక్క ఘటనలోనే కాదు.. రాష్ట్రంలో ధ్వంసానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న అన్ని ఉదంతాల్లోనూ జరిగింది ఇదే. దీన్నిబట్టి ఈ పనులు చేస్తున్నవారి ఉద్దేశ్యం సుస్పష్టంగా కనిపిస్తోందని భక్తులు, హిందూ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆలయాలపై జరుగుతున్న దాడుల పట్ల భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన నుంచి సీఎం జగన్ తప్పుకోవాలన్నారు. వైకాపా ప్రజాప్రతినిధుల్లో హిందువులు లేరా..? అని ప్రశ్నించారు. భాజపా, జనసేన సంయుక్తంగా ఆందోళనలు చేపట్టింది. ఈనెల ఐదో తేదీన రామతీర్థం మహాపాదయాత్రకు పిలుపునిచ్చింది.
సీబీఐ దర్యాప్తునకు డిమాండ్...
ప్రశాంత వాతావరణం, మత సామరస్యం నిండుగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణంగా విద్వేషాలకు చోటిచ్చే ఘటనలు జరగడం తక్కువే. ఇటీవల కాలంలో వరుసపెట్టి దేవాలయాలు, రథాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రథాలను తగలబెట్టారు. కొన్ని జరుగుతున్నా ఒక్కచోట కూడా నిందితులను పట్టుకోకపోవడం మరిన్ని ఘటనలు జరిగేందుకు కారణమవుతుందన్న విమర్శలున్నాయి. ఏడాది కాలంగా ప్రారంభమైన ఈ మనోభావాలు గాయపరిచే ప్రక్రియకు అడ్డుకట్టవేసే ప్రయత్నాలు జరగాల్సినంత స్థాయిలో జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నిరసస కార్యక్రమాలు చేపట్టింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. విగ్రహాల ధ్వంసం కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.