ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యశాఖలో ముందస్తు బదిలీలు... సీనియర్‌ వైద్యుల అభ్యంతరం - Doctors early transfers issue

Transfers in AP Health Department: రాష్ట్రంలో వైద్యుల ముందస్తు బదిలీలు చర్చనీయాంశమయ్యాయి. సిఫార్సులతో జరుగుతున్న ఈ బదిలీల వల్ల తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని సీనియర్‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సు బదిలీ పొందిన వారిలో సాక్షాత్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సతీమణి కూడా ఉండడం విశేషం.

Doctors Transfer
Doctors Transfer

By

Published : Feb 12, 2022, 7:21 AM IST

Transfers in AP Health Department: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల ముందస్తు బదిలీలు చర్చనీయాంశమయ్యాయి. సిఫార్సులతో జరుగుతున్న ఈ బదిలీల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని సహచర సీనియర్‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల ఉత్తర్వులను రహస్యంగా ఉంచుతున్నారు. సిఫార్సు బదిలీ పొందిన వారిలో సాక్షాత్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సతీమణి కూడా ఉండడం విశేషం. ప్రభుత్వం నిషేధాన్ని తొలగించడంతో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి సాధారణ బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని గతనెల 28న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులననుసరించి బదిలీకి అర్హత కలిగిన వారి నుంచి ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తరుణంలో ముఖ్యంగా బోధనాసుపత్రుల వైద్యుల్లో పలువురికి ముందస్తు బదిలీ ఉత్తర్వులు గురువారం రహస్యంగా వెలువడడం గమనార్హం. పక్కపక్కన ఉండే గుంటూరు నుంచి విజయవాడ, కడప నుంచి కర్నూలు వైద్య కళాశాలకు కూడా బదిలీలయ్యాయి. ముందస్తు బదిలీలు విశాఖ ఆంధ్రవైద్య కళాశాలకు ఎక్కువగా ఉన్నాయి.

  • బదిలీలపై నిషేధమున్న సమయంలో మినహాయింపులిచ్చే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. 2020, 2021లో ప్రత్యేక బదిలీల కోసం పలువురు వైద్యులు రకరకాల సిఫార్సులతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ బదిలీలు చేపట్టే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదంతో ఇప్పుడు వీటిపై జీవోలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బదిలీల ద్వారా కోరుకున్నచోట పనిచేసే అవకాశం కోసం ఏళ్లతరబడి నిరీక్షించేవారికి తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో బదిలీ పొందినచోట పనిచేయకుండా డిప్యుటేషన్‌పై వారనుకున్నచోట పనిచేస్తూ ఈ స్థానాన్ని బదిలీ ద్వారా పదిలం చేసుకుంటున్నారు. ఈ తరహా బదిలీలు పొందే వారిలో పరపతి ఎక్కువగా ఉండే బోధనాసుపత్రుల వైద్యులు ఎక్కువగా ఉన్నారు.

మచ్చుకు కొన్ని..

  • కడప బోధనాసుపత్రి పిడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ బి.విజయ్‌ ఆనంద్‌బాబును కర్నూలు బోధనాసుపత్రికి బదిలీ చేశారు. కర్నూలు బోధనాసుపత్రి పిడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ రమాదేవిని కడపకు బదిలీ చేశారు.
  • నెల్లూరులోని ఏఎస్‌ఎస్‌ఆర్‌ బోధనాసుపత్రి అనస్తీషియా ప్రొఫెసర్‌ పద్మజను విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలకు బదిలీచేశారు.
  • ఒంగోలు బోధనాసుపత్రి జనరల్‌ సర్జన్‌ ఎస్‌.మైథిలీదేవిని కాకినాడలోని రంగారాయ వైద్యకళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బదిలీచేశారు. ఆమె బోధనాసుపత్రులను పర్యవేక్షించే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రాఘవేంద్రరావు సతీమణి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీల నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమిటీకి ఆయనే ఛైర్మన్‌.
  • గుంటూరు వైద్యకళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.పార్వతి (ఎస్టీడీ డిపార్టుమెంట్‌)ని విశాఖ వైద్య కళాశాలకు బదిలీ చేశారు.
  • కడప వైద్య కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జనార్దనరావును విశాఖకు బదిలీ చేశారు.
  • తిరుపతి స్విమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (పల్మనరీ మెడిసిన్‌) సుబ్బారావు ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది నెల్లూరులోని ఎస్‌సీఎస్‌ఆర్‌ కళాశాలకు బదిలీ అయ్యారు.
  • గుంటూరు వైద్యకళాశాల సైకాలజీ ప్రొఫెసర్‌ సుహాసినిని విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలకు బదిలీ చేశారు.

ఇదీ చదవండి:Debts: అప్పుల కోసం తంటాలు పడుతున్న రాష్ట్ర సర్కార్​

ABOUT THE AUTHOR

...view details