విద్యా సంస్థల ప్రహరీల నుంచి వంద గజాల (300 అడుగులు) లోపు ఎక్కడా సిగరెటు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా పక్కా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం 2007 - 08లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 21 ప్రభుత్వ శాఖలు పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంది. అయితే.. ఇది అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నుంచి తాజాగా వచ్చిన ఆదేశాలను అనుసరించి వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విద్యా సంస్థలకు దగ్గర్లో నిబంధనలను అతిక్రమించి దుకాణాల్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించేవారికి రూ.20 నుంచి రూ.200 వరకు జరిమానా విధించే అధికారం ఇతర శాఖల అధికారులతోపాటు హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు కూడా ఉంటుంది. అయితే ఈ విషయం అనేక మంది తెలియదు. కొందరికి తెలిసినా పట్టించుకోవడంలేదు.