ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై పోరాటం... వికసించిన పల్లె చైతన్యం..! - ap villagers latest news

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు రాష్ట్రంలోని పలు గ్రామాలు నడుంకట్టాయి. పొలిమేర్లలో గ్రామస్థులు సరిహద్దులను దిగ్బంధించారు. మార్గంలో ముళ్ల కంచెలు వేసి రహదారిని మూసివేశారు. చాలా చోట్ల గ్రామ యువత.. ఇతరులు తమ గ్రామంలోకి రాకుండా పహారా కాశారు. ఇళ్లలో నుంచి ఎవరూ రావొద్దని ప్రచారం చేశారు.

self restraint by villagers in ap
ఏపీలో గ్రామాల స్వీయ నిర్బంధం

By

Published : Mar 26, 2020, 6:44 AM IST

Updated : Mar 26, 2020, 10:09 AM IST

కరోనాపై పోరాటం... వికసించిన పల్లె చైతన్యం..!

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతున్న గ్రామాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆయా గ్రామాల పొలిమేరల్లో చెక్​పోస్టులను గ్రామస్థులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి అందుబాటులో ఉన్న కర్రలు, రాళ్లు, తాళ్ల వంటి పరికరాలతో కంచెలు కట్టుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఊరు నుంచి బయటకు వెళ్లకుండా, కొత్త వారెవరూ లోపలికి రాకుండా చూస్తున్నారు. చాలా చోట్ల గ్రామ యువత పహారా కాస్తున్నారు. ఇళ్లల్లో నుంచి ఎవరూ రావొద్దంటూ మైకుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి శివారు పాలకాయతిప్ప, చిన్న గొల్లపాలెం, కాళీపట్నం, కంచికచర్ల మండలం వీరులపాడు, జగ్గయ్యపేట మండలం బలుసుపాడు, బూధవాడ, అన్నవరం, కంచికచర్ల మండలం గుండేపల్లి, తిరువూరు మండలం ముసుకుళ్ల శివారు రోడ్లపై ముళ్లకంచెను అడ్డుగా వేసి ఇతర ప్రాంతాల నుంచి వాహన రాకపోకలను అడ్డుకున్నారు.

సిక్కోలులో గ్రామాల స్వీయ నిర్బంధం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారథి, డోకులపాడు, వజ్రపుకొత్తూరు, పాతపట్నం మండలం సింగుపురం, మెళియాపుట్టి మండలంలోని పలు గ్రామాల్లో రహదారులకు అడ్డంగా కంచెలు, కర్రలు వేసి గ్రామస్థులు చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. టెక్కలి మండలం జగన్నాథపురం వద్ద రహదారికి అడ్డంగా కర్రలు కట్టారు. జి.సిగడాం గ్రామానికి వచ్చే మార్గాన్ని పూర్తిగా మూసేశారు. వీరఘట్టం మండలం పెద్దగదబలవలసలో ట్రాక్టర్లను రహదారికి అడ్డంగా పెట్టారు. సంతబొమ్మాళి మండలం సరసాపురం, చిన్న తుంగాల గ్రామాల్లో రహదారికి అడ్డంగా వాహనాలను ఉంచారు.

విశాఖలో..

విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీలోని పరిగెలపాలెం, గిరగొయ్యిపాలెం, పాయకరావుపేట మండలం కుమారపురం, నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బొద్దిగల్లం, రేబాబక, బంగారమ్మపేట, పెదదొడిగల్లు గ్రామాల్లో రహదారులకు అడ్డంగా గేట్లు పెట్టి దుంగలు వేసి స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.

తూర్పుగోదావరిలో..

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పాతకోరింగ రోప్​వేపై ముళ్ల కంచెలతో దారిని బంధించారు. కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో రోడ్డుకు అడ్డంగా ముళ్లపొదలను అడ్డుపెట్టారు. దేవీపట్నం మండలం పోతవరం వద్ద కంచె ఏర్పాటు చేసుకున్నారు. కాజులూరులో దారికి అడ్డంగా లారీని పెట్టి రాకపోకలను నియంత్రించారు.

నెల్లూరులో

నెల్లూరు జిల్లా కలవాయి మండలంలోని నూకనపల్లి సరిహద్దు వద్ద గ్రామస్థులే కాపలా ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మకూరు మండలం సాతానుపల్లి ప్రవేశ మార్గంలో యువత పహారా కాస్తున్నారు. సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి, అరుంధతివాడ, ఉదయగిరి మండలం గండిపాలెం, పొదలకూరు మండలం శాంతినగర్​లలో ఇలాంటి పరిస్థితే ఉంది.

అనంతపురంలో

అనంతపురం జిల్లా ఆత్మకూరు, రాప్తాడు మండలంలోని ఎం. చెర్లోపల్లి, తాడిమద్రి మండలం ఎం. అగ్రహారం, శెట్టూరు మండలంలోని మల్లేపల్లి, బొమ్మనహాళ్​ మండలంలో ఉద్దేహాళ్​, ధర్మవరం మండలం మాల్కాపురం, పామిడి మండలం ఎదురూరు, కనగానపల్లి మండలం కోనాపురం తదితర గ్రామాల ప్రజలు పొలిమేరల దగ్గర ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలకు చెందిన యువకులే రొటేషన్​ పద్ధతిలో ఆ కంచెల వద్ద పహారా కాస్తున్నారు. బయటివారెవరూ తమ గ్రామంలోకి అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ఒకచోట బాధ్యత ఉంటే.. మరోచోట నిర్లక్ష్యం ఉంది..!

Last Updated : Mar 26, 2020, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details