తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు, పట్టణంలోని వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించడంతో పట్టణంలోని పురవీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి రెండు గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచడం, రెండు గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయడంతో వేములవాడ పట్టణంలోని ఆలయ ప్రాంతంతో పాటు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తితో భయానికి గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.
కోడె మొక్కులు నిలిపివేత
భక్తులు లేక వేములవాడ రాజన్న ఆలయం వెలవెలబోతోంది. మరోపక్క... ఆలయంలో కోడెమొక్కుల సేవలను అధికారులు నిలిపివేశారు. కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది. ఆలయంలో ఉదయం 7నుంచి సాయంత్రం 7వరకు సాధారణ దర్శనాలు మాత్రమే కొనసాగుతున్నాయి. మార్చి 31న శివకళ్యాణం సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొనడం పలు విమర్శలకు తావిచ్చింది.