PAYYAVULA SECURITY: ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. పయ్యావుల గన్‌మెన్లను వెనక్కి రావాలని ఆదేశాలిచ్చింది. నిన్నటి వరకు ఉన్న 1+1 సెక్యూరిటీని పెంచాలంటూ కొద్దిరోజుల క్రితం.. పోలీసు ఉన్నతాధికారులకు పయ్యావుల లేఖ రాశారు. ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ విషయమై ప్రభుత్వానికి కేశవ్ కౌంటర్ ఇచ్చారు. దాన్ని జీర్ణించుకోలేకే.. భద్రతను ఉపసంహరించారంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఇది బెదిరింపులకు దిగడమేనని ధ్వజమెత్తారు.
ఇదీ జరిగింది: పెగాసెస్ పరికరాలు చంద్రబాబు కొనలేదని స.హ.చట్టం సమాధానం వచ్చినా.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పయ్యావుల మండిపడ్డారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగులను వేధించారన్నారు. పెగాసెస్‌పై సభా కమిటీ వేసి చర్చ నిర్వహించటం వృథాప్రయాసే అయిందని అన్నారు. ఇదంతా వైకాపా ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.