కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాంపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ.. తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర రైతుల అవసరాల దృష్ట్యా సంపూర్ణ సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇంధనశాఖ ఉత్తర్వులు వెలువరించింది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్‌ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదులు, కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతను వివరిస్తూ సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.