జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ విద్యార్థి, నిరుద్యోగ యువత నేడు సీఎం నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రానికే పోలీసు బలగాలు తాడేపల్లికి చేరుకున్నాయి. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్‌అఫీజ్ నేతృత్వంలో అదనపు ఎస్పీ ఈశ్వరరావు పర్యవేక్షణలో పహారా కొనసాగుతోంది.
నేడు ఉదయం పదింటికి హెలికాప్టర్‌లో సీఎం జగన్ పోలవరం సందర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. తాడేపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గమ్మ వారధి, సీతానగరం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రత్యేక బలగాలతో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. రాజధాని గ్రామాల్లో, ఇతర ప్రాంతాల్లోనూ పోలీసు బలగాలను మోహరించారు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మినహా సామాన్యులు ఎవరిని సర్వీస్ రహదారిలోకి అనుమతించడం లేదు.