రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తుంటే.. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వైరస్ గతంలో వచ్చిన దానికన్నా 4 రెట్లు అధిక శక్తివంతమైనది వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని సూచిస్తున్నారు. గతంలో కరోనా వచ్చి తగ్గిన వారికి సైతం మళ్లీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజుకు 4 లక్షలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని.. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అందుకు తగ్గట్టుగానే ఉందన్నారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ కరోనా స్టెయిన్ లు యూకె, అమెరికా , అరబ్ లాంటి దేశాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఏపీలోకి వేగంగా విస్తరిస్తోందన్నారు. కొత్తరకం కరోనాలో 7 రకాల లక్షణాలు కనిపించే అవకాశముందని వైద్య నిపుణులు తెలిపారు. శరీరం అంతటా నొప్పులు, కన్ను ఎర్రగా మారటం, గొంతు నొప్పి, శరీరంపై దద్దుర్లు ఏర్పడటం, చేతి, కాలివేళ్ల గోర్ల రంగు మారటం, తీవ్రమైన తలనొప్పి, డయేరియా లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ తీవ్రత ఐదు, ఆరు నెలల పాటు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి.. నిబంధనలు కఠినతరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడం ఆందోళన కల్గిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికి 5.8 కోట్ల మంది మాత్రమే వ్యాక్సినేషన్ వేయించుకోగా.. రాష్ట్రంలో కేవలం 20 లక్షల 74వేల మందికి మాత్రమే టీకాలు వేశారు. కరోనా రెండో వేవ్ తీవ్రమయ్యే లోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు.