తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరిలో భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అత్యవసర సేవల కంట్రోల్ నంబర్లు 08744-241950, 08743-232444, సహాయం కోసం 93929 19743 నంబరుకు ఫొటోలు వాట్సప్ చేయాలన్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45.20 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 47.30 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం. నీటిమట్టం ప్రస్తుతం 48 అడుగులు దాటగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం 11,41,10 క్యూసెక్కులుగా ఉంది.
ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. భద్రాచలంలో నిన్న 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం.. ఈ ఉదయానికి 43 అడుగులు దాటింది. పెరిగిన ప్రవాహంతో... స్నానఘట్టాల ప్రాంతంతో పాటు మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో లోతట్టు ప్రాంతాలైన అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్‌నగర్ కాలనీల వాసులను అధికారులు పునరావాసాలకు తరలించారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడుకు రాకపోకలు నిలిచిపోయాయి.