ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్‌ఈసీ నిర్ణయం.. సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే: ద్వివేది - Panchayati Raj Chief Secretary Gopalakrishna Dwivedi news

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయితీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించటంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈమేరకు పంచాయితీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటన విడుదల చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇది అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఉల్లఘించటమేనని ద్వివేది ప్రకటనలో తెలిపారు.

GOPALA KRISHNA DWIVEDI
ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే

By

Published : Jan 9, 2021, 7:15 AM IST

ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించటమేనని పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆరోపించారు. కొవిడ్ టీకా ఇచ్చేందుకు అవసరమైన సన్నాహకాల్లో ఉన్నామని నివేదించినా ….ఎస్ఈసీ మొండి వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ప్రకటన విడుదల చేసిన ద్వివేది.... ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

గతంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల్ని వాయిదా వేశారని.. ఇప్పుడూ అదే వ్యవహార శైలిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్ దృష్ట్యా ఎన్నికలు జరిపేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవని... అవి అనుకూలించగానే తెలియచేస్తామని లిఖిత పూర్వకంగా ఇచ్చినా ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తామనటం సరికాదని ద్వివేది స్పష్టం చేశారు. ఏకపక్షంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఆదేశాలు ఇవ్వటంతో పాటు షెడ్యూలు కూడా ప్రకటించారని ద్వివేది తప్పుబట్టారు.

జనవరి 13వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి దేశంలో ప్రక్రియ ప్రారంభానికి కేంద్రం సమాచారం పంపిందని.. ఈ కారణాలతో సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినా ఎస్ఈసీ అంగీకరించలేదని ద్వివేది పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ కష్ట సాధ్యమని.. వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకూ వాయిదా వేయాల్సిందిగా కోరినా ఎస్ఈసీ పట్టించుకోకపోవటం ఏకపక్ష నిర్ణయమని…. ద్వివేది ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి 9 తేదీన, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 11 తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడనున్నారని తెలియచేసినా... ఎస్ఈసీ మొండిగా తన నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నారని ద్వివేది ఆరోపించారు. ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పటం శోచనీయమన్నారు. ప్రజారోగ్యమనే విశాల ప్రయోజనాన్ని పక్కకు పెట్టి అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారని ద్వివేది ప్రకటనలో విమర్శించారు.

ఇదీ చదవండి:

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ, సీఎస్ పరస్పర లేఖలు

ABOUT THE AUTHOR

...view details