పురపాలక ఎన్నికలను సమర్థంగా నిర్వహించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల తరహాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు సహా నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఎస్ఈసీ అభినందించారు. సమన్వయంతో, సమర్థంగా వ్యవహరించి ప్రశాంతంగా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.
అనంతరం పురపాలిక ఎన్నికల నిర్వహణపై చర్చించారు. నామినేషన్ల దాఖలు కోసం వచ్చిన వినతులు, ఫిర్యాదులపై కలెక్టర్లతో ఎస్ఈసీ చర్చించారు. బలవంతపు ఏకగ్రీవాలు, సింగిల్ నామినేషన్లపై రేపటిలోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశించారు. బలవంతపు ఏకగ్రీవాలు, ఉప సంహరణలు, సింగిల్ నామినేషన్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ల నివేదిక ఆధారంగా ఒకట్రెండు రోజుల్లో నామినేషన్ల స్వీకరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసి మరణించిన అభ్యర్థులకు చెందిన పార్టీలకు రీ-నామినేషన్ల దాఖలుకు ఇప్పటికే అవకాశం ఇవ్వగా.. పురోగతిపై చర్చించారు. గంటపాటు కొనసాగిన ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ కొవిడ్ నివారణ, పోలింగ్ నిర్వహణ సహా మిగిలిన అంశాల్లో సమర్థంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎస్ఈసీ దిశానిర్దేశం చేశారు. పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు సమావేశం అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈసీ