ఏపీలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పరిస్థితులు నెలకొనే వరకూ స్థానిక ఎన్నికల ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరువారాల పాటు నిలుపుదల చేస్తూ అప్పటి ఎస్.ఈ.సీ రమేష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. దానిపై సమీక్షించిన ఎస్.ఈ.సీ మరికొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కిందటి మార్చిలో నోటిఫికేషన్ జారీ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు, పట్టణ స్థానిక సంస్థలకు షెడ్యూల్ కూడా విడదలైంది. ఈ లోగా కరోనా మహమ్మారి విస్తరిస్తుండటంతో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ.. మార్చి 15న ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల ప్రక్రియను ఆరువారాలపాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన కమిషనర్ . ఆ లోగా కరోనా అదుపులోకి వస్తే.. అంతకంటే ముందే ఎన్నికలను కొనసాగించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎస్.ఈ.సీ నోటిఫికేషన్ గడువు ముగిసిపోవడంతో తాజాగా ఎన్నికల కమిషన్ పరిస్థితిని సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగించే పరిస్థితి లేదని నిర్థరించి.. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది.
రాజకీయ దుమారం
స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ.. అప్పటి ఎస్.ఈ.సి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయం అనూహ్యమైన మలుపులకు కారణమైంది. ఆ క్రమంలోనే ఆయన.. తన పదవినీ కోల్పోయారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ.. ఎస్.ఈ.సి ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి స్వయంగా నిమ్మగడ్డపై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ దురుద్దేశంతో వ్యహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నకల వాయిదాపై తమను సంప్రదించలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేవిధంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి.. రమేష్‌కుమార్ ను పదవి నుంచి దింపేసింది.
కోర్టులోనూ.. ఎదురుదెబ్బ
స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలుపుదలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్నికల వాయిదా విషయంలో కమిషన్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు, తదుపరి ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. ఎన్నికల తేదికి నెల రోజుల ముందు నుంచి ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని చెప్పింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని పంచాయతీ భవనాల రంగులు మార్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది. ఇందుకోసం లాక్డౌన్ ముగిసిన తర్వాత మూడు వారాల గడువు ఇచ్చింది.
ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న మీదట రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో కోర్టు తీర్పులనూ ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం మే 17 వరకూ లాక్డౌన్ కొనసాగిస్తుండటంతో.. దానికి అనుగునంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ మార్గదర్శకాలు పాటిస్తోందని.. మరో రెండు వారాల పాటు.. ప్రజలు గుమికూడే కార్యకలాపాలు ఏవీ కొనసాగించే వీలు లేనందున స్థానిక ఎన్నికల ప్రక్రియను మరికొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్.. ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకూ వాయిదా పడుతుందన్నారు. రాష్ట్రంలో పంచాయతీల ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పంచాయతీ కార్యాలయాల రంగులు మార్చేవరకూ ఆ ప్రక్రియ కూడా వాయిదా పడినట్లే.
ఇదీ చదవండి:
జే ట్యాక్స్ కోసమే కొత్త బ్రాండ్లు: ఆలపాటి