ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించవద్దు' - ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆగ్రహం వార్తలు

రాష్ట్రంలో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమైన జిల్లాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అధిక పంచాయతీల్లో ఏకగ్రీవాలైనట్లు గుర్తించిన కమిషన్.. నియామక ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించింది. ఏకగ్రీవాలపై సమగ్రంగా నివేదిక పంపాలని కలెక్టర్లను ఆదేశించిన ఎస్ఈసీ.. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించవద్దని స్పష్టం చేశారు.

SEC orders to suspend unanimous statements until allowed
అనుమతిచ్చేదాకా ఏకగ్రీవ ప్రకటనలు నిలిపివేయాలని ఎస్ఈసీ ఆదేశాలు

By

Published : Feb 5, 2021, 11:51 AM IST

Updated : Feb 6, 2021, 4:20 AM IST

రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో ఏకగ్రీవమైన స్థానాల వివరాలను రిటర్నింగ్ అధికారులు... జిల్లా కలెక్టర్లకు అందించారు. వీటన్నింటినీ క్రోడీకరించిన జిల్లా కలెక్టర్లు ఏకగ్రీవమైన పంచాయతీల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. తొలిదశలో విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లోని 168 మండలాలు, 3,249 గ్రామపంచాయతీల్లో జరగనున్న ఎన్నికల్లో... చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 52 , కడప జిల్లాలో 49, విశాఖపట్నం జిల్లాలో 43, పశ్చిమ గోదావరి జిల్లాలో 41, శ్రీకాకుళం జిల్లాలో 37, ప్రకాశం జిల్లాలో 35, తూర్పు గోదావరి జిల్లాలో 30, నెల్లూరు జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 23, అనంతపురం జిల్లాలో 6 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదికలు పంపారు.

నివేదికలు పంపండి....

వీటిని పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవాలైనట్లు గుర్తించారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోనే ఏకగ్రీవాలు ఎక్కువగా జరగడంపై ఎస్ఈసీ చర్యలకు ఉపక్రమించారు. రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరగడానికి కారణాలేమిటన్న విషయాన్ని తెలుపుతూ నివేదికలు పంపాలని రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చే వరకు ఏకగ్రీవాల ప్రకటనలను నిలిపివేయాలని స్పష్టం చేశారు.

సిబ్బందికి అభినందనలు...

చిత్తూరు, గుంటూరు జిల్లాలో మినహా ఇతర జిల్లాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నట్లు కనిపించడం లేదని ఎస్ఈసీ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని అభినందించారు. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

గుంటూరులో మొదలైన విచారణ
ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. జేసీ, డీఆర్వో, డీపీవో ఆధ్వర్యంలో పది బృందాలను నియమించారు. వీరంతా శుక్రవారం మధ్యాహ్నమే క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు. తెనాలి డివిజన్‌లో మొత్తం 337 పంచాయతీలు, 3442 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 67 పంచాయతీలు, 1337 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాల వెనుక అసాధారణ కారణాలు ఉన్నాయా? స్థానిక పరిస్థితులను బట్టే జరిగాయా? తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. గ్రామాలకు వెళ్లి నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులను కలిసి పోటీ నుంచి ఎందుకు తప్పుకొన్నారు? ఎవరైనా బెదిరించారా? ప్రలోభపెట్టారా? అని ప్రశ్నించారు.

అభ్యర్థుల అభిప్రాయాలను స్వీయ ధ్రువీకరణ పత్రాల ద్వారా తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల సిబ్బంది, పోలీసులను విచారించారు. నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఓ సర్పంచి అభ్యర్థిని విచారించగా.. తనకు సాక్షి సంతకం చేసినవారు బెదిరించడం వల్లే తప్పుకున్నట్లు తెలిపారు. అయితే ఆ అభ్యర్థి తాను అనారోగ్యంతో బాధ పడుతున్నందున నామినేషన్‌ వెనక్కి తీసుకున్నట్లు స్వీయధ్రువీకరణ పత్రం ఇచ్చారు. మరికొందరు అభ్యర్థులు తాము అందుబాటులో లేమని అధికారులకు ఫోన్‌లో చెప్పారు. శుక్రవారం రాత్రికి ఎస్‌ఈసీకి ప్రాథమిక నివేదిక అందించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఇదీ చూడండి:

సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు

Last Updated : Feb 6, 2021, 4:20 AM IST

ABOUT THE AUTHOR

...view details