రాష్ట్రంలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని)ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశించారు. అప్పటి వరకు మంత్రి సమావేశాల్లోగానీ, బృందాలతోగానీ మాట్లాడరాదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరు, ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్ ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. మంత్రి కొడాలి నాని శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని, దానిపై సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని రమేశ్‌కుమార్ ఆయనకు షోకాజ్ నోటీసిచ్చారు. మంత్రి తన న్యాయవాది చిరంజీవి ద్వారా ఎస్‌ఈసీకి బదులిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రతిపక్ష పార్టీ అరాచకాల్ని బయటపెట్టే క్రమంలో మీడియా సమావేశం నిర్వహించానని నాని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల తనకు గౌరవం ఉందని, ప్రత్యేకించి ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తానని, షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని మంత్రి కోరారు. దానితో సంతృప్తి చెందని రమేశ్‌కుమార్... మంత్రిపై చర్యలు తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏడు పేజీల సుదీర్ఘ ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రిలో పశ్చాత్తాపం లేదు
ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని మంత్రి తోసిపుచ్చలేదని, పైగా వాటిని తాను ఏ ఉద్దేశంతో అన్నానో గమనించాలని సలహా ఇచ్చారని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఆయన ఇచ్చిన సమాధానంలో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. పైగా ఎన్నికల సంఘం ఎలా వ్యవహరించాలో కూడా సూచించే దుస్సాహసానికి ఒడిగట్టారని తెలిపారు. ఎన్నికల కమిషన్‌పైనా, కమిషనర్‌పైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిలో భాగంగానే, ఇప్పుడు కూడా మంత్రి కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నట్లు తెలిపారు. ‘మంత్రి ఎన్నికల కమిషనర్‌తో పాటు ఒక ప్రముఖ ప్రతిపక్ష నాయకుడిని, ప్రముఖ మీడియా సంస్థల అధిపతులను కూడా కలిపి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారిని సహ కుట్రదారులుగా అభివర్ణించారు. వారిలో ఒకరు సమాజానికి చేసిన విశిష్ట సేవలకుగాను అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ సహా అనేక గౌరవాలు పొందినవారు. అలాంటి అవార్డు గ్రహీతలు మన జాతి గౌరవానికి ప్రతీకలు. అలాంటి వారి గురించి చపలచిత్తమైన వ్యాఖ్యలు చేయకుండా, సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ‘నేనేదో ముఖ్యమంత్రి పతనాన్ని కోరుకుంటున్నాను అన్నట్టుగా మంత్రి వ్యాఖ్యానించారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రికి, ఆయన కార్యాలయానికి నేను సముచిత గౌరవం ఇస్తున్నాను. మంత్రి వ్యాఖ్యలు మర్యాదకు, నైతికతకు భంగం కలిగించేవిగా, విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. మంత్రి నాలుగైదు నెలలుగా ఎన్నికల సంఘంపై నిందాపూర్వకమైన, అభ్యంతరక పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నా.. దానిపై స్పందించకూడదని మిన్నకున్నాం. కానీ ఎన్నికలు జరుగుతుండగా మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మంత్రిపై చర్యలు తీసుకుంటున్నాం’ అని ఎస్‌ఈసీ పేర్కొన్నారు.