ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అవరోధాలు తొలగితే పరిషత్‌ ఎన్నికలు : ఎస్​ఈసీ

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకితభావంతో పనిచేసిందని ప్రశంసించారు. ఎంతో విజ్ఞత, సంయమనంతో వ్యవహరించడం వల్లే సాధ్యమైందని అన్నారు.

SEC Nimmagadda
SEC Nimmagadda

By

Published : Feb 22, 2021, 10:21 AM IST

Updated : Feb 23, 2021, 5:17 AM IST

కోర్టులో అవరోధాలు తొలగాక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. 4దశల పంచాయతీ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావించాం. కోర్టు పరిధిలో ఒకటి, రెండు అంశాలున్నాయి. వాటి గురించి మాట్లాడటం వాంఛనీయం కాదు. అవరోధాలు తొలగితే ఎన్నికలు నిర్వహిస్తాం’ అని అన్నారు. ‘ప్రత్యేక పరిస్థితుల్లో, ఒత్తిడి కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయామని ఆధారాలతో ముందుకొచ్చిన వారిని పరిగణనలోకి తీసుకొని మంగళవారంలోగా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకు సూచిస్తున్నాం. వీరందరి హక్కులను పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు.

సర్పంచి ఏకగ్రీవాలు 16.77%
‘4 దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 16.77 శాతం సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో 2,197 సర్పంచి స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. 1,31,023 వార్డు సభ్యుల స్థానాల్లో 47,459 (36.22%) చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 12,740 సర్పంచి స్థానాల్లో 1,980 (15.54%) చోట్ల ఏకగ్రీవమయ్యాయి. 1,29,316 వార్డు సభ్యుల స్థానాల్లో 44,448 (34.37%) చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి ఎన్నికలతో పోల్చి చూస్తే ఏకగ్రీవాలు దాదాపు అదేలా ఉన్నాయి’ అని ఎస్‌ఈసీ విశ్లేషించారు. 4దశల్లో కలిపి 81.78 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. ‘కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఉత్సాహంగా తరలిరావడం సంతోషదాయకం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నుంచి కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించారు. ఉద్యోగులు, పోలీసులు విశేష సేవలందించారు. భాగస్వాములైన అందరికీ ఎన్నికల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది’ అని ఎస్‌ఈసీ వివరించారు.

విజ్ఞతతో వ్యవహరించిన రాజకీయ పక్షాలు
‘పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పక్షాలు విజ్ఞతతో వ్యవహరించాయి. ఈ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు నమోదుకాకపోవడం విశేషం. సాంకేతిక అంశాల వల్లే ఒకట్రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి’ అని ఎస్‌ఈసీ తెలిపారు..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

ఇదీ చదవండి:నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ

Last Updated : Feb 23, 2021, 5:17 AM IST

ABOUT THE AUTHOR

...view details