ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SDRF funds : 'ఆ నిధులను ఇతర అవసరాలకు వాడొద్దు' - ఏపీ తాజా సమాచారం వార్తలు

SDRF funds :అత్యవసరంగా వినియోగించుకునేందుకు కేంద్రం ఇచ్చిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో నిధుల మళ్లింపు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంమైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణా నిధులను పీడీ ఖాతాలకు మళ్లించొద్దన్నసుప్రీం.. ఒకవేళ ఇప్పటికే మళ్లించి ఉంటే వాటిని ఇతర అవసరాలకు వాడొద్దని ఆదేశించింది.

SDRF funds
SDRF funds

By

Published : Apr 14, 2022, 5:35 AM IST

SDRF funds : అత్యవసరంగా వినియోగించుకునేందుకు కేంద్రం ఇచ్చిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇప్పటికే కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టగా తాజాగా ఈ అంశం బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ చర్చకు వచ్చింది. ఈ నెల 28 లోగా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం విశేషం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాగిన ఈ అంశం తాజా పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశమవుతోంది.

ఖర్చు చేయకుండానే చేసినట్లు చూపారన్న కాగ్‌
కేంద్ర ప్రభుత్వ వాటాగా రాష్ట్రానికి విపత్తు నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద రూ.324.15 కోట్లు ఇచ్చింది. మరో రూ.570.91 కోట్లు జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద ఇచ్చింది. ఈ నిధులు తక్షణమే విపత్తు నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని...ఆ నిధులను పీడీ ఖాతాలకు మళ్లించి విపత్తు నిర్వహణ కోసం ఖర్చులో చూపించారనేది ప్రధానాంశం. 2020 మార్చి నెలాఖరుకు రాష్ట్ర ఆర్థిక అంశాలను పరిశీలించిన కాగ్‌ ఈ విషయాన్ని తప్పుబట్టింది. మరో వైపు రూ.1,100 కోట్లు 2020 మార్చి నెలాఖరుకు వ్యవసాయశాఖ కమిషనర్‌ డిపాజిట్‌ ఖాతాకు మళ్లించారు. ఖరీఫ్‌ కాలానికి సంబంధించి పెట్టుబడి రాయితీగా అందించేందుకు ఈ మొత్తం బదిలీ చేశారు. అదే మొత్తాన్ని 2020 మార్చి 31న తిరిగి వ్యవసాయశాఖ కమిషనర్‌ పీడీ ఖాతాకు బదిలీ చేశారు. ఈ నిధులను విపత్తు నిర్వహణ, సాయం కింద ఖర్చు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ చూపిందని కాగ్‌ గుర్తించింది. పీడీ ఖాతాకు బదిలీ చేసిన ఈ మొత్తం నిధులను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతా నుంచి సర్దుబాటు చేసినట్లు చూపించారు. నిజానికి ఆ నిధులు ఖర్చు చేయకుండానే విపత్తు నిర్వహణ కింద ఖర్చు చేసినట్లు పేర్కొన్నారని ప్రస్తావించింది. ఒక వైపు అసలు ఖర్చు చేయకుండానే ఇలా చూపించడం అనేక అనుమానాలను లేవనెత్తుతోందనేది కాగ్‌ ఆరోపణ. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రం ఖర్చు చేసినట్లు పేర్కొంటున్న లెక్కలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులు తక్షణ సాయంగా మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. విపత్తుల సమయంలో తక్షణ సాయంగా వినియోగించుకోవాల్సిన ఖర్చుల కోసమే ఈ నిధిని వినియోగించాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అలా తక్షణ సాయంగా వినియోగించుకోకుండా పీడీ ఖాతాలకు మళ్లించే విధానాన్ని సరి చేసుకోవాల్సి ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు రాష్ట్ర ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిధులు సరిగా ఖర్చు చేయడం లేదనే అంశం సుప్రీంకోర్టు ముందుకు పిటిషన్‌ రూపంలో వచ్చిన కేసులో ఈ లేఖనూ జత చేయడం గమనార్హం.

ఇదీ చదవండి:"నిబంధనలు ఉల్లంఘిస్తారా..?" రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details