ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ప్రభావం: పాఠశాలల పునఃప్రారంభంపై కొనసాగుతున్న అయోమయం - schools latest news

పాఠశాలలు తిరిగి తెరిచేదెప్పుడు? అసలు ఈ విద్యా సంవత్సరం ఉంటుందా? ప్రస్తుతం తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులందరిలోనూ ఇదే చర్చ. మామూలు రోజుల్లోనే పాఠశాలలకు వెళ్లి వచ్చే పిల్లలు అక్కడి పరిస్థితుల వల్ల రకరకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. అలాంటిది కరోనా సమయంలో వాళ్లను పంపేదెలాగన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.

studies
studies

By

Published : Jun 22, 2020, 9:11 AM IST

ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ తెరవొచ్చని కేంద్రం చెప్పినా.. ప్రస్తుతం కేసుల విస్తృతి చూస్తుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. నవంబరు నాటికి కరోనా కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకోవచ్చని, ఆ సమయంలో ఐసొలేషన్‌ వార్డులు, వెంటిలేటర్లకు కొరత రావొచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఏర్పాటుచేసిన ‘ఆపరేషన్స్‌ రీసెర్చ్‌ గ్రూపు’ అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపే విషయంలో చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ ఆందోళనగానే ఉన్నారు. కరోనా కారణంగా మార్చి 25 నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. రాష్ట్రంలో ఇప్పటికే పదోతరగతి, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దుచేసి, విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. డిగ్రీ, పీజీ, బీటెక్‌ పరీక్షలపైనా సమాలోచనలు జరుగుతున్నాయి. మిగిలిన తరగతులకు ప్రస్తుతం కొత్త పాఠాలను చాలావరకు ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు సప్తగిరి ఛానల్‌ ద్వారా రోజుకు 4-5 గంటలు పాఠాలు చెబుతున్నారు. కానీ, పాఠశాలలు తెరిచే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

జాతీయ స్థాయిలోనూ చర్చలు

ఈ క్రమంలో.. శూన్య విద్యా సంవత్సరం (జీరో అకడమిక్‌ ఇయర్‌)పై జాతీయస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. దిల్లీ లాంటి నగరాల్లో కొందరు ఉపాధ్యాయులు కూడా పెద్దసంఖ్యలో కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పట్లో స్కూళ్లు తెరిచేందుకు హడావుడి వద్దని, వీలైతే ఈ విద్యా సంవత్సరాన్ని శూన్య సంవత్సరంగా ప్రకటించాలని తల్లిదండ్రుల సంఘాలు డిమాండు చేస్తున్నాయి. ఇటీవలే దిల్లీలో విద్యాహక్కు ఉద్యమకారులు, తల్లిదండ్రుల సంఘాలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాలు దీనిపై చర్చించాయి. వీరిలో ఎక్కువమంది 2020-21ని శూన్య విద్యా సంవత్సరంగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌ లేదా టీవీలు / యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా బోధన కొనసాగించి.. పరీక్షలు, గ్రేడ్లు లేకుండానే పిల్లలను పై తరగతులకు పంపాలన్నది వీరి అభిప్రాయం. అలా కాకుండా పూర్తిగా శూన్య విద్యా సంవత్సరాన్నే అమలుచేస్తే మాత్రం పిల్లలు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆగస్టులో పాఠశాలలు తెరిచినా.. తమ పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు ఎంతమంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉంటారనేది అనుమానంగానే కనిపిస్తోంది. చాలామంది కొత్త కరోనా కేసులు రావడం ఆగిపోతేనే పంపిస్తామంటున్నారు. ఇంకొంతమంది టీకా, మందు వచ్చిన తర్వాత తెరిస్తేనే మేలని అంటున్నారు.

టీకా వచ్చే వరకూ భయమే

కరోనా వైరస్‌కు టీకా వచ్చేవరకూ బడికి పంపాలంటే భయమే. చదువు కంటే ప్రాణం ముఖ్యం. మా అబ్బాయి ఇప్పుడు తొమ్మిదో తరగతికి వస్తాడు. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు ఉన్నచోట సమస్యే.- కె.భవాని, విజయవాడ

అన్నీ పరిశీలించాకే పంపిస్తాం

మా బాబు విశాఖ వ్యాలీ పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాలలు తెరిచినా పిల్లలను పంపాలంటే భయమే. నెల రోజుల తర్వాత తరగతులు మొదలవుతాయంటున్నారు. పాఠశాలకు వెళ్లి కరోనా నివారణకు తీసుకునే జాగ్రత్తలు చూసి, అప్పటి పరిస్థితులను బట్టి పంపిస్తాం. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. - మీనాకుమారి, విశాఖపట్నం

ప్రత్యామ్నాయ పద్ధతులు అన్వేషించాలి

ప్రస్తుతం పాఠశాలలు ఎప్పుడు తెరుస్తామో చెప్పలేని పరిస్థితి. అయితే, శూన్య విద్యా సంవత్సరం అవసరం లేదనే అనుకుంటున్నాను. ప్రత్యామ్నాయ పద్ధతులు అన్వేషించాలి. ఇలాంటి సమయంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో నిర్వహించడం కష్టమే. పరిమితులకు లోబడి పిల్లలకు సీడీలు, కథలు, ఇతర పుస్తకాలను ఇవ్వాలి. విడతల వారీగా పాఠశాలలు నిర్వహించినా పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. అవసరాన్ని బట్టి ప్రాంతాల వారీగా బడుల నిర్వహణపై నిర్ణయం తీసుకోవచ్చు. మారుమూల ప్రాంతాల్లో కరోనా కేసులు లేకపోతే అక్కడ ఒకలాంటి బోధన, కేసులున్న చోట మరో రకమైన బోధన చేసేలా ఉండాలి. - విఠపు బాలసుబ్రహ్మణం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ

అవకాశం ఉన్నన్ని రోజులూ తరగతులు నిర్వహించాలి

కరోనా తగ్గిన తర్వాత 2021 జూన్‌ వరకు అవకాశం ఉన్నన్ని రోజులూ తరగతులు నిర్వహించాలి. విద్యా సంవత్సరాన్ని కుదించాలి. వీలైనంత మేరకే తరగతులు, పరీక్షలు నిర్వహించడం మంచిది. - ఆనంద్‌ కిశోర్‌, మాజీ సంచాలకులు, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి

ఇతర దేశాల్లో ఇలా..

  • ఇటలీ, దక్షిణ కొరియాలలో పూర్తిగా ఆన్‌లైన్‌ బోధనతోనే విద్యా సంవత్సరం కొనసాగిస్తున్నారు.
  • వియత్నాంలో రోజు మార్చి రోజు తరగతులు పెడుతూ, గదిలో 20 మందికి మించకుండా బోధిస్తున్నారు.
  • జపాన్‌లో తరగతి గదుల్లో గాలి ధారాళంగా వచ్చేలా రూపుమార్చారు. వ్యక్తిగత దూరం నిబంధన పాటిస్తున్నారు.
  • హాంకాంగ్‌లో సీనియర్‌ సెకండరీ తరగతులే మొదలయ్యాయి. భోజనాల రద్దీ నివారణకు ఒంటిపూట బడులు పెడుతున్నారు.
  • తైవాన్‌లో పిల్లల చుట్టూ ప్లాస్టిక్‌ తెరలు అమర్చారు.

-

ఇదీ చదవండి:

పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై నేడు సుప్రీంలో విచారణ

ABOUT THE AUTHOR

...view details