ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Schools Reopen: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌కు అనుమతి లేదు!

పిల్లలను బడికి పంపాలని బలవంతం చేయొద్దంటూ.. సెప్టెంబర్​ 1వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభిస్తానంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఆన్​లైన్​ తరగతులు ఉండవని అంతర్గత నిర్ణయాలు తీసుకుని.. కనీసం దానిపై ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. స్కూలుకు పంపాలా? వద్దా? అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటే.. ప్రత్యక్ష బోధన ప్రారంభం అంటే ఆన్‌లైన్‌ ఉండదనే అర్థమా అంటూ ప్రైవేట్​ పాఠశాలల యజమానులు తలలు పట్టుకుంటున్నారు.

Schools Reopen
ఆన్‌లైన్‌కు అనుమతి లేదు!

By

Published : Aug 30, 2021, 5:31 PM IST

ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా ఆన్‌లైన్‌ తరగతులు ఉండవని, కేవలం ప్రత్యక్ష బోధనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించింది. కానీ అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇప్పటివరకు ఉత్తర్వులు ఇవ్వకపోవడం గమనార్హం. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీఓలో, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఆ విషయాన్ని స్పష్టం చేయలేదు. అధికారులు మాత్రం ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం అంటే ఆన్‌లైన్‌ ఉండదనే కదా అర్థం అని చెబుతున్నారు. ఇప్పటికే ఇంటర్‌ విద్యాశాఖ టీశాట్‌ అధికారులకు తమ టీవీ పాఠాలను ఆపాలని కోరింది. ఇంకా పాఠశాల విద్యాశాఖ అధికారికంగా సమాచారం పంపలేదని టీశాట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ కూడా కొనసాగిస్తే ఏం చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరిని ప్రశ్నించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించాం.. వాటిని ఉల్లంఘిస్తే అప్పుడు తగిన చర్యలుంటాయని చెబుతున్నారు.

బలవంతం లేదు అంటూనే..

ఎక్కువమంది విద్యార్థులుంటే ఆ పాఠశాల యాజమాన్యం షిఫ్టు విధానంలో బడులను నడుపుకునేందుకు విద్యాశాఖ అనుమతిచ్చే అవకాశం ఉంది. ఒకవైపు హాజరు తప్పనిసరి కాదు.. బడికి పంపాలని బలవంతం చేయవద్దని ప్రభుత్వం చెబుతోంది.. మరోవైపు ఆన్‌లైన్‌ బోధనకు అనుమతి లేదంటే పిల్లలు చదువు మానేయాలని అర్థమా అని పాఠశాలల యజమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు.

నేడు డీఈఓలతో సమావేశం

ప్రభుత్వ పాఠశాలలను కొవిడ్‌ నిబంధనల మేరకు నడిపేందుకు సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈఓలతో ఆన్‌లైన్‌ సమావేశం జరపనున్నారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లో కొన్ని అంశాలపై స్పష్టత లేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో మార్పులు, చేర్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

బెస్తవారిపేటలో పిచ్చికుక్క బీభత్సం.. 25 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details