ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ నిబంధనల మధ్య తెరుచుకున్న విద్యాసంస్థలు - ఏపీలో ప్రారంభమైన స్కూళ్లు అప్ డేట్స్

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు ఇవాళ్టి నుంచి తెరుచుకున్నాయి. కరోనా కారణంగా మార్చి మాసంలో మూతపడ్డ విద్యాసంస్థలు 7 నెలల విరామం తరువాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఏయే తరగతుల విద్యార్థులు ఎప్పటినుంచి హాజరు కావాలనేది స్పష్టం చేస్తూ సమగ్ర మార్గదర్శకాలతో ప్రభుత్వం షెడ్యూళ్లను విడుదల చేసింది.

schools-reopen-in-andhra-pradesh
schools-reopen-in-andhra-pradesh

By

Published : Nov 2, 2020, 9:59 AM IST

Updated : Nov 2, 2020, 3:55 PM IST

తెరుచుకున్న పాఠశాలలు

రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా దాదాపు ఏడు నెలలుగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు పకడ్బందీ మార్గదర్శకాల మధ్య పునఃప్రారంభించారు. ఇవాళ కేవలం 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే బోధన ప్రారంభమైంది. 6, 7, 8 వ తరగతుల వారికి నవంబర్ 23 నుంచి... ఒకటి నుంచి ఐదవ తరగతుల వారికి డిసెంబర్ 14 నుంచి పాఠాలు మొదలు కానున్నాయి. తొలి రోజు అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంది.

మార్గదర్శకాల మధ్యే...

విద్యా సంస్థల పునఃప్రారంభం నేపథ్యంలో తరగతి గదులన్నీ శానిటైజేషన్ చేశారు. థర్మల్ స్క్రీనింగ్ తరువాతే విద్యార్థులను అనుమతిస్తున్నారు. తరగతి గదిలో 16 మంది కంటే ఎక్కువ ఉండకుండా.. బెంచికి ఒకరే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రోజువిడిచి రోజు మాత్రమే స్కూళ్లు నడుస్తాయి.

థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు

అంతంత మాత్రమే..

భయం లేకుండా పిల్లలను పంపాలని ప్రభుత్వం భరోసా ఇచ్చినా...తల్లిదండ్రుల నుంచి అంతగా స్పందన రాలేదు. చాలా చోట్ల పిల్లలను పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. దాదాపు 40 నుంచి 50 శాతం మంది విద్యార్థులను పంపించేందుకు సముఖంగా లేరని అంటున్నారు.

శానిటైజర్ అందిస్తున్న సిబ్బంది

కరోనా కలకలం...

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలోని మోడల్ స్కూల్, జడ్పీ పాఠశాల తెరిచిన మొదటి రోజు కరోనా కలకలం రేగింది. 50 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... నలుగురు పాజిటివ్ అని తేలింది. వీరిలో ఒక విద్యార్థితో పాటు, ముగ్గురు వంట సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

180 రోజుల పాటు తరగతులు...

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 180 రోజులపాటు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకున్న పనిదినాల్లో 144 రోజులు క్లాసుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు ఇబ్బంది కలగకుండా తక్షణ ప్రవేశాలు కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. పిల్లలు, పాఠశాల సిబ్బంది ఆరోగ్యం, పరిశుభ్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలలు తెరుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం నిర్దేశిత ప్రామాణిక విధానాలను (ఎస్‌ఓపీ) ప్రకటించింది.

నిర్దేశిత ప్రామాణిక విధానాలు...

  • నవంబరు నెలాఖరు వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 1.30 వరకు తరగతులు నిర్వహించాలి. నవంబరులో ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించి డిసెంబరులో నిర్ణయాలు తీసుకుంటారు.
  • ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు. వారంతా ఆరడుగుల దూరం పాటించాలి. విద్యార్థుల సంఖ్య 750కి మించితే 3విభాగాలుగా చేసి 3 రోజులకోసారి హాజరయ్యేలా చూడాలి.
  • విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎడం పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు ప్రశాంతంగా ఉండే ఇతర స్థలాలను తాత్కాలికంగా వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ హాజరుకావాలి.
  • అన్ని పాఠశాలల యాజమాన్యాలు వార్షిక క్యాలెండర్‌ను అనుసరిస్తూ తరగతులను నిర్వహించాలి. హాజరైనవారికి మధ్యాహ్న భోజనం అందించాలి.
  • 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు కూడా దగ్గరలోని పాఠశాలల్లో రోజువారీ హాజరుకావొచ్చు. అక్కడ వారికి మధ్యాహ్నభోజనం పెట్టాలి.
  • 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈనెల 2 నుంచి వసతిగృహాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. ఒకవేళ సంబంధిత సంస్థలు సన్నద్ధంగా లేనట్లయితే 23లోపు ఎప్పుడైనా తెరచుకోవచ్చు.
  • ఈలోగా విద్యార్థులను దగ్గర్లోని పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతోపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.

ఇదీ చదవండి:

రాజధాని కేసులో ఇంప్లీడ్ పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు

Last Updated : Nov 2, 2020, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details