సెలవులయిపోయాయ్... ఇక స్కూళ్లకు బయల్దేరండి...' పిల్లల అల్లరి భరించలేక ప్రతి విద్యాసంవత్సరం ఆరంభంలో తల్లిదండ్రులు చెప్పే మాట ఇది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. వారే స్వయంగా పిల్లలను ఇంట్లోనే ఉండమంటున్నారు. 'చదువు ఆన్‌లైన్‌లో అయినా వస్తుంది కానీ ఆరోగ్యం రాదు కదా' అంటున్నారు. మార్చి తర్వాత నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరుచుకోనుండగా..... పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ్టి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయ్ - Schools Reopen in AP latest news
నేటి నుంచి బడి గంట మోగనుంది. సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించటంతో పాటు అందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గత ఏడాదితో పోల్చితే ప్రైవేటు పాఠశాలల్లో ఈసారి 30శాతం తక్కువగా ఫీజులు వసూలు చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్‌డౌన్ అనంతరం దాదాపు ఎనిమిది నెలల తరువాత రాష్ట్రంలో బడులు తెరచుకుంటున్నాయి. పకడ్బందీ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 180 రోజులపాటు తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబరు రెండో తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వరకున్న పనిదినాల్లో 144 రోజులు బడుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు ఇబ్బంది కలగకుండా తక్షణ ప్రవేశాలు కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. పిల్లలు, పాఠశాల సిబ్బంది ఆరోగ్యం, పరిశుభ్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలలు తెరుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం నిర్దేశిత ప్రామాణిక విధానాలను (ఎస్‌ఓపీ) ప్రకటించింది.
- నవంబరు నెలాఖరు వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 1.30 వరకు తరగతులు నిర్వహించాలి. నవంబరులో ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించి డిసెంబరులో నిర్ణయాలు తీసుకుంటారు.
- ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు. వారంతా ఆరడుగుల దూరం పాటించాలి. విద్యార్థుల సంఖ్య 750కి మించితే 3విభాగాలుగా చేసి 3 రోజులకోసారి హాజరయ్యేలా చూడాలి.
- విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎడం పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు ప్రశాంతంగా ఉండే ఇతర స్థలాలను తాత్కాలికంగా వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ హాజరుకావాలి.
- అన్ని పాఠశాలల యాజమాన్యాలు వార్షిక క్యాలెండర్‌ను అనుసరిస్తూ తరగతులను నిర్వహించాలి. హాజరైనవారికి మధ్యాహ్న భోజనం అందించాలి.
- 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు కూడా దగ్గరలోని పాఠశాలల్లో రోజువారీ హాజరుకావొచ్చు. అక్కడ వారికి మధ్యాహ్నభోజనం పెట్టాలి.
- 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈనెల 2 నుంచి వసతిగృహాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. ఒకవేళ సంబంధిత సంస్థలు సన్నద్ధంగా లేనట్లయితే 23లోపు ఎప్పుడైనా తెరచుకోవచ్చు. ఈలోగా విద్యార్థులను దగ్గర్లోని పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతోపాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలి.