కరోనా కేసులు 10%లోపు ఉండే ప్రాంతాల్లో మాత్రమే సోమవారం పాఠశాలలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకొని, ప్రతి వారం కేసులను నిర్ధారించుకోవాలని సూచించింది. విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించి తరగతులను నిర్వహించాలి. ఒక్కో బ్యాచ్‌లో వారి సంఖ్య 20కి మించకూడదు. సెలవు రోజులు మినహా బోధన, బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ హాజరవ్వాలి. భౌతికదూరం పాటిస్తూ, సరిపడా స్థలముంటే అన్ని తరగతులను ఒకేసారి నడపొచ్చు. గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు నిర్వహించాలి. 6, 7 తరగతులు ఒకరోజు, 8, 9, 10 తరగతులు మరోరోజు నిర్వహించాలి. బడికిరాని పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలి. ప్రధానోపాధ్యాయులు కరోనా కారణంగా విద్యార్థులు నష్టపోయిన అభ్యసనంపైనా దృష్టి సారించాలి.
ఈ నిబంధనలు తప్పనిసరి
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దలతో ఉండే పిల్లల్ని తరగతులకు అనుమతించొద్దు. ఇలాంటి వారిని ఇంటి వద్దనే ఉండాలని సూచించాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు పిల్లల్ని పాఠశాలకు తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు సైతం అనుమతించకూడదు.
- విద్యార్థులు, సిబ్బందికి రోజూ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే పరీక్షలకు పంపించాలి.
- మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించాలి. ఎవ్వరూ ముఖాముఖిగా కూర్చోవద్దు. పాఠశాల వదిలిన సమయంలో గూమిగూడొద్దు.
- అసెంబ్లీ, గ్రూపు పని, క్రీడలు నిర్వహించరాదు. పిల్లలను స్వచ్ఛందంగా పంపిస్తున్నట్లు తల్లిదండ్రుల నుంచి అనుమతి లేఖలు తీసుకోవాలి.
- ప్రతివారం ఒక పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ర్యాండమ్ పరీక్షలు నిర్వహించాలి. ఎవరికైనా పాజిటివ్ వస్తే మొత్తం అందరికీ పరీక్షలు చేయాలి.
- విద్యార్థులు పెన్నులు, పెన్సిళ్లు, నోటుపుస్తకాలు, పుస్తకాలు, నీళ్ల సీసాలు మార్చుకోవద్దు.
- పాఠశాల బస్సుల్లోనూ సగం మందికే అనుమతించాలి. ఆటోలు, రిక్షాల్లో విద్యార్థులు రావద్దు. బస్సులు, వ్యాన్లు లేకుంటే తల్లిదండ్రులే తీసుకొచ్చి, తీసుకెళ్లాలి.
ఇదీ చదవండి: భరతమాతకు స్వాతంత్ర్యం- ఎందరో మహానుభావుల త్యాగఫలం