వినూత్న నిరసన... వివాహ కార్డుపై సేవ్ అమరావతి - అమరావతి ఆందోళనలు వార్తలు
ఉన్నత ఉద్యోగం కోసం పరదేశం వెళ్లిన ఆ యువకుడు మూలాలు మరచిపోలేదు. అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనకు తన వంతుగా సంఘీభావం తెలిపాడు. త్వరలో జరగనున్న తన వివాహానికి ముద్రించిన శుభలేఖలపై 'సేవ్ అమరావతి...సేవ్ ఫార్మర్స్' అని రాసి అమరావతికి మద్దతు పలికాడు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన జాస్తి సురేష్ తన వివాహ శుభలేఖపై సేవ్ అమరావతి.. సేవ్ ఫార్మర్స్ అని రాసి వినూత్నంగా నిరసన తెలిపాడు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని.. తనను చదివించడానికి తన తండ్రి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకోడానికి ఇలా ముద్రించానని ఆయన తెలిపారు. కెనడాలో ఉద్యోగం చేస్తున్న సురేష్.. తన వంతు కృషిగా తోటి ఉద్యోగులతో కలిసి రాజధాని రైతుల కోసం విరాళాలు సేకరించటంతో పాటు.. అమరావతి కోసం చేసిన నిరసనల్లోనూ పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన తన వివాహ నిశ్చయ కార్యక్రమానికి విచ్చేసిన రాజధాని రైతులు కనీసం భోజనం చేయకుండా వెళ్లిపోవడం తనను కలిచివేసిందని సురేష్ అన్నారు. రైతుల ప్రయోజనాలు, సమస్యలు దృష్టిలో ఉంచుకుని తన వివాహ ఆహ్వానలేఖ 'అమరావతిని రక్షించండి... రైతులను కాపాడండి' అని ముద్రించానని చెప్పారు. తన వివాహ కార్డు ద్వారా రైతుల ఆవేదన ప్రతీ ఒక్కరికి తెలియజేయాలని ఇలా చేశానని సురేష్ తెలిపారు. రైతుల ఇబ్బందులను దగ్గర నుంచి చూసిన తన కుమారులు.. రైతులకు మద్దతుగా శుభలేఖపై ఇలా ముద్రించడం పట్ల సంతోషంగా ఉందని సురేష్ తల్లి పేర్కొన్నారు.