తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారానికి(Podu land issue in telangana) 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీశాఖ సన్నద్ధం అవుతోంది. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం ఎప్పటి నుంచి జరుగుతోందన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC News) సాయం తీసుకుంటోంది. అటవీప్రాంతాల పరిస్థితిపై సంవత్సరాల వారీగా శాటిలైట్ మ్యాప్‌లను తెప్పించింది. వీటిని జిల్లాల వారీగా డీఎఫ్‌వోలకు పంపించనున్నట్లు సమాచారం. ఈ మ్యాప్‌లు పోడు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియకు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,23,629 ఎకరాల్లో అటవీభూమి ఆక్రమణకు గురైనట్లు అటవీశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తాజాగా మరోసారి అధికారులు అంచనా వేయగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్నిచోట్ల ఇప్పటికీ ఆక్రమణలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సమస్య ఉన్న జిల్లాల్లో తాజాగా అఖిలపక్ష సమావేశాలు కూడా జరిగాయి. నవంబరు 8 నుంచి నెలరోజుల పాటు పోడు(Podu land issue in telangana) సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. అటవీహక్కుల గుర్తింపు చట్టం ప్రకారం.. గ్రామ, సబ్‌డివిజన్, డివిజన్ స్థాయి కమిటీలు వీటిని పరిశీలిస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలన కోసం గ్రామస్థాయి కమిటీల్లో అటవీ, గిరిజన, రెవెన్యూ తదితర శాఖలకు చెందినవారుంటారు. అటవీశాఖ తరఫున ఇందులో బీట్ అధికారిని నియమిస్తారు. 2,156 గ్రామాల్లో అటవీ ఆక్రమణలు ఉండగా, సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో తగినంతమంది బీట్, సెక్షన్ అధికారులు లేకపోవడంతో ఇతర జిల్లాలవారిని సర్దుబాటు చేయనున్నారు. సబ్‌డివిజన్ కమిటీల్లో ఎఫ్‌ఆర్‌వో, జిల్లా కమిటీల్లో డీఎఫ్‌వో ఉంటారు.