కృష్ణా జిల్లాలో..
నాగుల చవితి సందర్భంగా విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉపాలయమైన శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో సురేష్ బాబు దేవస్థానం తరఫున శాస్త్రోక్తంగా పూజలు చేసి, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అనపర్తి వీర్రాజు మామిడి వద్ద ఉన్న సుబ్రహ్మణ్యశ్వేర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యానాంలో..
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నాగుల చవితిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద భక్తులు పూజలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. పుట్టల వద్ద ఎక్కువ మంది గూమికూడి ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొవిడ్ నుంచి తొందరగా బయటపడేలా చూడాలని భక్తులు నాగేంద్రుడిని వేడుకున్నారు.