రాజకీయ నాయకులకు కన్నీళ్లు ఎప్పుడొస్తాయి.. వాళ్ల గుండెలు ఏ రోజున మండిపోతాయి? ప్రజల కష్టాలను చూసినప్పుడా... వాటిని చూస్తూ కూడా తాము బెల్లంకొట్టిన రాళ్లలా మిగిలిపోతున్నామన్న స్పృహ కలిగినప్పుడా? అబ్బే... అటువంటి ఆలోచన కానీ, కనీసం దింపుడుకళ్లం ఆశ కానీ మనం పెట్టుకోకూడదు. జనం ఇక్కట్లు చూడవద్దు, వాటి గురించి వినవద్దు, మాట్లాడవద్దని ఇంట్లో అద్దం ముందు ప్రమాణస్వీకారం చేసిన తరవాత కానీ, వారు ప్రజాసేవకు అడుగు బయటపెట్టరు. అసలంత సున్నిత మనస్కులు రాజకీయాలకు పనికిరారండీ బాబూ... నానా ఈతిబాధలతో జనం చచ్చిబతుకుతున్నా సరే, తెల్లబట్టలు నలగకుండా ఒడ్డున నిలబడి ‘ఏంకాదు... మరేంకాదు’ అంటూ చేతులూపుతూ చిరునవ్వులు చిందించగలిగిన వారే నేతలు కాగలరు. అయితే, అంతటి స్థితప్రజ్ఞులను సైతం చలింపజేయగలిగిన శక్తిస్వరూపిణి లేకపోలేదు! అదేమిటో కాదు... పదవి. ‘పెదవి దాటని మాటొకటి ఉంది... ఇస్తారని ఆశగ ఉంది’ అంటూ దానికోసం అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చేతుల్లో చిడతలొక్కటే తక్కువ కానీ, మాటల్లో ఆ లోటు తెలియకుండా చూసుకుంటారు. అయ్యవారి దృష్టిలో పడటానికి అవసరమైన పాట్లన్నీ మహదానందంగా పడతారు. అవి ఫలించి కుర్చీ దక్కిందా... ‘అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిధి’ అంటూ పరవశించిపోతారు. లెక్కలు తిరగబడి అమాత్య యోగం ముఖం చాటేసిందా, అంతే- కళ్లు ఎర్రబడి, ముక్కుపుటాలు ఎగిరిపడి, పొగిడిన నోళ్లే శాపనార్థాలు పెడతాయి. ‘ఫ్యాన్’ మార్కు రాజకీయ ప్రహసనంలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి దృశ్యాలన్నీ పరమ రోమాంచితంగా ప్రదర్శితమవుతున్నాయి.
‘ఎంతటివాడోయి చిన్నిదేవుడు’ అంటూ మొన్నటి వరకు కొండంత రాగాలు తీస్తూ కోటి కీర్తనలు ఆలపించిన వీరవిధేయ భక్తాగ్రేసరులే నేడు భగ్న పదవీ ప్రేమికులయ్యారు. ‘దేవుడయ్యా దేవుడూ మాయదారి దేవుడూ... నమ్మినోళ్ల గొంతునులిమే దేవుడూ’ అని ఎవరికివారు కన్నీటి గీతికలు పాడుకొంటున్నారు. రాజీనామాలు చేసేవారు చేస్తుంటే- అలిగి ఇంట్లో కూర్చుని అనుచరులతో అల్లరి చేయిస్తున్న వారు చేయిస్తున్నారు. ఆ మాత్రం ధైర్యం లేని వారు నాలుగు గోడల నడుమ గుడ్లనీరు కుక్కుకుంటున్నారు. మంత్రుల ఎంపికకు ప్రమాణాలేమిటో బుర్ర చించుకున్నా బోధపడక మొత్తానికి అందరూ (తాత్కాలిక) రాజకీయ వైరాగ్యంతో కుమిలిపోతున్నారు. ప్రజలకు ఎలాగూ చెప్పరు... అమాత్యులయ్యేందుకు అర్హతలేమిటో అయ్యవారు కనీసం తమ అంతేవాసులకైనా చెప్పి, వారిని తరింపజేయవచ్చు కదా! అరివీర భయంకర బూతులతో ప్రతిపక్షాలపై బోరవిరుచుకు పడటమేనా ప్రమాణం? అందులో పరిశోధక పట్టా పుచ్చుకోనివారు ఆ పార్టీలో ఎవరైనా ఉన్నారంటారా! కాబట్టి అదొక్కటే సరిపోదు, ఇంకేదో కావాలి. సారుగారి మాటకు ఎదురాడకపోవడమా? అబ్బెబ్బే... ఇప్పుడంటే కూర్చున్న కుర్చీలను లాగేశారని కొందరు, తమకు పస్తులుపెట్టి ఎవరికో విస్తర్లు వేశారన్న కడుపు మంటతో మరికొందరు మాట్లాడుతున్నారు కానీ, ఆయన అడుగులకు మడుగులొత్తీ ఒత్తీ వెన్నెముకలు అరిగిపోయినవారే కదా అందరూ! ఆ అందరిలోంచి కొందరికి మాత్రమే కొసరికొసరి ఎలా వడ్డించారబ్బా అంటే ఏమో- లోగుట్టు ఆ జగన్నాథుడికే తెలియాలి!