Sarpanches in AP: నిధులు రాక..అభివృద్ధి పనులు చేయలేక అవమానాలు ఎదుర్కొంటున్న సర్పంచ్‌లు ప్రభుత్వంపై ఉద్యమ బావుటా ఎగురవేశారు. కేంద్రం ఇచ్చిన 15వ అర్థిక సంఘం నిదుల్ని తక్షణం విడుదల చేయాలంటూ నేడు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయనున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లుగా గెలిచి ఏడాదిన్నర దాటినా ఓట్లు వేసిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నామన్నారు.
ప్రభుత్వంపై సర్పంచ్‌ల తిరుగుబాటు: ఇటీవలే కేంద్రం 948 కోట్ల రూపాయలు 15వ ఆర్థికసంఘం నిధులు విడుదల చేసింది. ఈ నిధులు ఆయా పంచాయతీల ఖాతాల్లో పడీపడగానే.. రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. 14 వ ఆర్థికసంఘం నిధులు సైతం విద్యుత్ బకాయిల పేరిట గతేడాది ఇలాగే మళ్లించింది. దీనిపై సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇప్పటికీ గ్రామాల్లో ఒక్క రూపాయి పనులు కూడా చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒట్లేసి గెలిపించిన వారికి ముఖం చూపించలేకపోతున్నామంటున్నారు. రాష్ట్రంలో 13వేల 300 మంది సర్పంచ్‌లు ఉండగా.. వీరిలో మెజార్టీ వర్గం అధికార పార్టీకి చెందిన మద్దతుదారులే ఉన్నారు. వీరందరిదీ అదే పరిస్థితి.