గాంధీజీకి సర్పంచుల వినతిపత్రం Protest at Gandhi Statue:గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం ప్రశ్నార్థం చేసిందని తెలుగుదేశం ధ్వజమెత్తింది. గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతలు ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడంతో గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో సీనియర్ నేత కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో సర్పంచులు గాంధీ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని పలు పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు... మహాత్ముడి విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గాంధీజీకి తెలుగుదేశం కార్యకర్తలు నివాళులు అర్పించారు. సర్పంచులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ప్రభాకర్ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిరసన చేస్తున్న సర్పంచులకు... మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంఘీబావం తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో మహాత్ముడి విగ్రహనికి తెలుగుదేశం నేతలు క్షీరాభిషేకం చేశారు. వాలంటీర్ల విధానం తీసుకొచ్చి... పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను దెబ్బతీసిన జగన్ సర్కార్ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని కదిరి తెలుగుదేశం నేతలు విమర్శించారు. కళ్యాణదుర్గంలో చేతులకు సంకెళ్లు వేసుకొని నాయకులు ర్యాలీ నిర్వహించారు. దారి మళ్లించిన స్థానిక సంస్థల నిధుల్నివిడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సమీపంలోని గాంధీ విగ్రహానికి... "గ్రామ స్వరాజ్య పరిరక్షణకు 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని" సమర్పించారు. పంచాయతీ నిధులను ఇతర పథకాలకు మళ్లించడాన్ని నిరసిస్తూ.. సత్యసాయి జిల్లా పెనుకొండలో సర్పంచులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహాత్మా గాంధీ విగ్రహానికి తెలుగుదేశం సర్పంచులు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమల్లెంచటంపై సర్పంచులు నిరసన చేపట్టారు. వీరి ఆందోళనకు సంఘీబావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. సర్పంచ్ లకు ఉండే అధికారాలను నిర్వీర్యం చేయడంపై గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక సర్పంచులను ఒక బొమ్మలాగా చేసి పక్కన పెట్టారని తెలిపారు. కేవలం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ ఉద్యోగస్తులతోనే అన్ని కార్యక్రమాలు నడపడం అనేది చాలా దురదృష్టకరమన్నారు.
ఇవీ చదవండి: